Voyager 1: ఐదు దశాబ్ధాల క్రితం నాసా ప్రయోగించిన ‘వాయేజర్ 1’ అంతరిక్ష నౌక ప్రాణం పోసుకుంది. గత కొన్ని నెలల క్రితంగా విశ్వంలో దాని జాడ తెలియకుండాపోయింది. తాజాగా నౌక నుంచి సమాచారం అందినట్లు నాసా సోమవారం ప్రకటించింది. తాము పంపే సిగ్నల్స్‌ని వాయేజర్ 1 స్వీకరిస్తున్నప్పటికీ, నవంబర్ 14, 2023 నుంచి దాని నుంచి భూమికి సిగ్నల్స్ రావడం లేదని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు.
ప్రస్తుతం విశ్వంలో సుదూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువుగా వాయేజర్ 1 రికార్డు సృష్టించింది. 1977లో ప్రయోగించిన ఈ నౌక ప్రస్తుతం సౌరకుటుంబాన్ని దాటి ‘ ఇంటర్‌స్టెల్లార్’ మీడియంలోకి ప్రవేశించింది. భూమి నుంచి సుమారుగా 2400 కోట్ల కి.మీ(24 బిలియన్ కి.మీ.) కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, ఒక పనిచేయని చిప్ కారణంగా ఇటీవల వాయేజర్ 1లో సమస్య ఏర్పడినట్లు నాసా జెట్ ప్రొపల్షన్ బృందాలు కనుగొన్నాయి. అయితే, అంతరిక్ష నౌకలోని 46 ఏళ్ల క్రితం నాటి కంప్యూటర్ కోడింగ్ ఈ సమస్యను పరిష్కరించింది. ప్రస్తుతం వాయేజర్ 1లోని ఆన్‌బోర్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ హెల్త్, దాని పొజిషన్ గురించి కీలక డేలాను తిరిగి ఇచ్చినట్లు నాసా వెల్లడించింది. సైన్స్ డేటాను ఇవ్వడం తిరిగి ప్రారంభించింది.
1977లో ప్రారంభించిన వాయేజర్ 1 స్పేస్‌క్రాఫ్ట్ 2012లో ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది. మానవజాతి నిర్మించిన ఈ వ్యోమనౌక భూమి నుంచి ఏకంగా 24 బిలియన్ కి.మీ ప్రయాణించింది. ఇప్పటికీ అంతదూరం నుంచి సమాచారాన్ని పంపిస్తుంది. ఈ సమాచారం భూమి-వాయేజర్ 1 మధ్య బదిలీ కావడానికి 22.5 గంటల సమయం పడుతోంది. దీని తర్వాత ప్రయోగించిన వాయేజర్ 2 నౌక కూడా 2018లో సౌర వ్యవస్థను దాటింది. వాయేజర్ అంతరిక్ష నౌకల్లో ఏర్పాటు చేసిన రెండు ‘‘గోల్డెన్ రికార్డ్స్’’-బంగారు పూతపూసిన రాగి డిస్కులు మానవులకు సంబంధించిన సమాచారం, తాము ఉన్న స్థానాన్ని తెలిపే సమాచారాన్ని కలిగి ఉంది. గ్రహాంతవాసులకు మనుషుల వివరాలను తెలియజేసేందుకు ఇది ఉద్దేశించబడింది. 2025 తర్వాత వీటిలో ఉన్న బ్యాటరీలు క్షీణించనున్నాయి. ఆ తర్వాత భూమికి సందేశాలు ఇవ్వడం ఆగిపోతాయని భావిస్తున్నారు. ఇక ఇవి మన పాలపుంతలో గంటకు 61 వేల కి.మీ వేగంతో ఇలా ప్రయాణిస్తూనే ఉంటాయి.