NTV Telugu Site icon

Nasa: నాసా ప్రయోగం సక్సెస్.. గ్రహశకలాన్ని ఢీకొట్టిన నాసా అంతరిక్ష నౌక

Nasa

Nasa

Nasa Mission Success: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. భవిష్యత్‌లో భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించేందుకు నాసా ఈ ప్రయోగం చేపట్టింది. ఈ మేరకు డైమార్ఫస్ గ్రహశకలాన్ని నాసా అంతరిక్ష నౌక ఢీకొట్టింది. సుమారు రూ.2500 కోట్ల విలువైన ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్’ (డీఏఆర్‌టీ) స్పేస్‌క్రాఫ్ట్‌ గంటకు 22,50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ గ్రహశకలాన్ని ఢీకొట్టినట్లు నాసా సైంటిస్టులు వివరించారు. 10 నెలలుగా డీఏఆర్‌టీ అంతరిక్షంలో తిరుగుతోందని.. మంగళవారం ఇది గ్రహశకలాన్ని ఢీకొట్టిందని మేరీల్యాండ్‌లోని లారెల్‌లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఏపీఎల్) మిషన్ కంట్రోల్ ప్రకటించింది.

Read Also: NIA Raids: మూడో సారి 25 రాష్ట్రాల్లో NIA సోదాలు.. వామ్మో PFI అకౌంట్ లోకి అన్నికోట్లా..!

అయితే అంతరిక్ష నౌక ఢీకొట్టడంతో గ్రహశకలం గమనంలో ఎంత మార్పు వచ్చిందో ఇప్పుడే చెప్పలేమని నాసా సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. దీనికి కొంత సమయం పడుతుందని వాళ్లు తెలిపారు. డైమర్ఫస్ గ్రహశకలం డిడిమోస్ అనే 2,560 అడుగుల భారీ గ్రహశకలం చుట్టూ తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 530 అడుగుల వెడల్పు ఉన్న డైమర్ఫస్‌ గమనాన్ని మార్చేందుకు డార్ట్ ఉద్దేశపూర్వకంగానే దానిని ఢీకొట్టిందని తెలిపారు. భూమికి 7 మిలియన్ మైళ్ల (11 మిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఈ ఘటన జరిగినట్టు ఏపీఎల్ తెలిపింది. కాగా ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో భూమివైపు దూసుకొచ్చే ప్రమాదకర గ్రహశకలాలను అంతరిక్షంలోనే పక్కకు మళ్లించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.