అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. శ్వేతసౌధం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పోలీస్ అధికారి సహా పలువురికి బుల్లెట్లు తగిలాయి. అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీ 14 అండ్ యూ వీధిలోని జునెటీంత్ మ్యూజిక్ కన్సెర్ట్ సమీపంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఫైరింగ్లో ఒకరు మృతిచెందగా.. పోలీస్ అధికారి సహా పలువురికి తూటాలు తగిలినట్లు మెట్రోపోలిటన్ పోలీస్ విభాగం తెలిపింది. ఈ ఘటన అధ్యక్ష భవనమైన శ్వేత సౌధానికి సమీపంలోనే జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
అమెరికాలో కాల్పుల ఘటనలు అధికం కావడం వల్ల తుపాకీ నియంత్రణ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే తెలిపారు. 18-21 ఏళ్ల మధ్య వయసున్న వారు తుపాకులు కొనుగోలు చేయకుండా చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంతో ఎవరి హక్కులకు భంగం కలిగించడం తమ ఉద్దేశం కాదని.. ఇది ప్రజల రక్షణ కోసమేనని బైడెన్ చెప్పారు.
మే 24న అమెరికాలోని ఉవాల్డే స్థానిక ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో.. 19 మంది పిల్లలు సహా మరో ముగ్గురు మృతిచెందారు. సెంట్రల్ వర్జీనియాలో గ్రాడ్యుయేషన్ పార్టీ జరుగుతున్న సమయంలో ఓ 20 ఏళ్ల యువకుడు తుపాకీతో చెలరేగాడు. మే 31న జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఏడుగురు గాయపడ్డారు.