NTV Telugu Site icon

Monkeypox: యూరప్ లో కల్లోలం.. రెండు వారాల్లోనే మూడింతలైన కేసులు

Monkeypox

Monkeypox

ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని 51 దేశాల్లో 5 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే యూరప్ లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యూరప్ లో గత రెండు వారాల్లో కేసుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మంకీపాక్స్ కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ యూరప్ దేశాలకు సూచించింది.

ప్రపంచంలో నమోదైన కేసుల్లో యూరప్ దేశాల్లోనే 90 శాతం కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు యూరోపియన్ ప్రాంతంలోని 31 దేశాల్లో కేసులు నమోదు అయ్యాయి. 99 శాతం మంకీపాక్స్ కేసులు పురుషుల్లోనే గుర్తించారు. అది కూడా స్వలింగ సంపర్కం పెట్టుకున్నవారిలోనే మంకీపాక్స్ గుర్తించామని డబ్ల్యూహెచ్ఓ అధికారులు వెల్లడించారు. ఆఫ్రికాకే పరిమితం అయిన ఈ వ్యాధి మేలో బ్రిటన్ లో గుర్తించారు. ఆ తరువాత యూఎస్ఏలో కేసులు నమోదు అయ్యాయి.

యూరప్ లో బ్రిటన్ తో పాటు, బెల్జియం, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ , పోర్చుగల్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో కూడా మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. కేసుల తీరును గమనిస్తే 21 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న పురుషుల్లోనే ఈ వ్యాధిని గుర్తించారు. బ్రిటన్ తో పాటు జర్మనీలో ఇప్పటికే మంకీపాక్స్ నివారణ కోసం టీకాలను ప్రారంభించారు. రిస్క్ ఎక్కువగా ఉన్న వారికి టీకాను అందిస్తున్నారు.

మశూచి లక్షణాలు ఉండే మంకీపాక్స్ వల్ల పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే వ్యాధి వల్ల మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. వారం, రెండు వారాల్లో బాధితులు వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటారు. శరీరంపై దద్దర్లు, జ్వరం, నొప్పులు ఈ వ్యాధి లక్షణాలు.