Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్

  • న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ
  • నిర్వాహకుల ‘ఎక్స్’ ఖాతా సస్పెండ్
  • ర్యాలీకి అనుమతించబోమన్న న్యూయార్క్ మేయర్
Mohan Bhagwat

Mohan Bhagwat

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్ పర్యటన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో మోహన్ భగవత్ పాల్గొననున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వాహక సంస్థ అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ ఫోరమ్‌కు చెందిన ‘ఎక్స్’ ఖాతాను సోషల్ మీడియా వేదిక సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆ ఖాతా యూజర్లకు అందుబాటులో లేకుండా ‘Unavailable’గా కనిపిస్తోంది.

న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆగస్టు 29న ‘యూనివర్సల్ వనెస్ సెలబ్రేషన్’ పేరుతో కార్యక్రమం జరగనుంది. ఇందులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాన ప్రసంగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహకుల ‘ఎక్స్’ ఖాతా సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది.

పొరపాటుతో సస్పెండ్ చేశారా?

వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. తమ ‘ఎక్స్’ ఖాతా సస్పెన్షన్ పొరపాటుగా జరిగి ఉండొచ్చని ఈవెంట్ నిర్వాహకుల ఫోరమ్ తెలిపింది. తమ సోషల్ మీడియా కమ్యూనికేషన్ మొత్తం సార్వత్రిక శాంతి, ఐక్యత, సామరస్యం, మతాంతర-సాంస్కృతిక సంభాషణను ప్రోత్సహించేలా ఉందని పేర్కొంది. ‘ఎక్స్’ నిబంధనలకు అనుగుణంగానే తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సంస్థ వెల్లడించింది.

మోహన్ భగవత్ కార్యక్రమంపై వివాదం

మోహన్ భగవత్ పాల్గొననున్న కార్యక్రమంపై న్యూయార్క్‌లో రాజకీయంగా కూడా వివాదం కొనసాగుతోంది. న్యూయార్క్ మేయర్ మమ్దానీ ఆర్ఎస్ఎస్‌పై బహిరంగంగా విమర్శలు చేశారు. ఆగస్టు 29న మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మత స్వేచ్ఛపై సలహా సంస్థ USCIRF కూడా మోహన్ భగవత్ అమెరికా పర్యటనపై ఆందోళన వ్యక్తం చేసింది. భగవత్ ఇప్పటికే అమెరికాలో ఉన్న నేపథ్యంలో.. ఆయన వీసాను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరినట్లు పీటీఐ నివేదించింది. ఆర్ఎస్ఎస్‌కు అనుబంధంగా ఉన్న కొన్ని సంస్థలు మతపరమైన మైనారిటీలపై హింసాత్మక దాడులకు పాల్పడ్డాయని USCIRF ఆరోపించినట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలోనే భగవత్ పర్యటనపై ఆ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

మూడు దేశాల పర్యటనలో మోహన్ భగవత్

మోహన్ భగవత్ ప్రస్తుతం మూడు దేశాల పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్నారు. అమెరికాతో పాటు కెనడా, బ్రిటన్‌లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆగస్టు 29న ‘యూనివర్సల్ వనెస్ సెలబ్రేషన్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.