Pakistan: పాకిస్తాన్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో తమ హక్కుల కోసం నినదిస్తున్న స్థానిక ప్రజలను పాక్ ఆర్మీ ఊచకోత కోస్తోంది. పీఓకే అసెంబ్లీలో కాశ్మీరీ శరణార్థులకు రిజర్వేషన్లు కల్పిచడంపై స్థానికులు భగ్గుమన్నారు. ఇదే కాకుండా పాకిస్తాన్ తమ వనరుల్ని దోచుకుని పాక్ పంజాబ్ ప్రావిన్సుకు తరలిస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఓకేలోని రావల్‌కోట్ ప్రాంతంలో మొదలైన ఈ తిరుగుబాటు ముజఫరాబాద్, మీర్పూర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతాలకు విస్తరించింది.
అయితే, పాకిస్తాన్‌కు గత కొన్నేళ్లుగా అండగా నిలుస్తున్న మీర్పూరి ముస్లింలు ఇప్పుడు ఆ దేశంపై తిరుగుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా యూకేలో కాశ్మీర్ విషయంలో, భారత్‌కు వ్యతిరేకంగా కథనాన్ని నిడిపించడంలో ఈ మీర్పూరి ముస్లింలు కీలకంగా వ్యవహరించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. పీఓకేలో తమ వారిపై చేస్తున్న దౌర్జన్యాలపై పాకిస్తాన్‌ను ప్రశ్నిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యూకే వెళ్లి అక్కడే సెటిల్ అయిన ఈ మీర్పూరి ముస్లింలు అక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. ఇప్పుడు, పాకిస్తాన్ దురాగతాలపై యూకే స్పందించేలా ఒత్తిడి తీసుకువస్తున్నారు. బ్రిటన్‌లో ఉన్న ముస్లింలలో ఈ మీర్పూరి ముస్లింలే 60-70 శాతం ఉంటారు. బ్రిటన్ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తివంతమైన కమ్యూనిటీగా మారారు. బ్రిటన్‌లో 50 ఎంపీ స్థానాల్లో వీరు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు.
తాజాగా, 30 మంది బ్రిటిష్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా పీఓకే ఘటనలపై యూకే విదేశాంగశాఖకు లేఖ రాశారు. ఈ ఎంపీల బృందానికి బ్రాడ్‌ఫోర్డ్ ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ నాయకత్వం వహిస్తు్న్నారు. ఇతను కూడా మీర్పూరి ముస్లిం సంతతికి చెందిన వాడే. పీఓకేలో తమ వారితో మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని, పాక్ ఇంటర్నెట్ సస్పెండ్ చేసిందని, అక్కడి విషయాలు తెలియకుండా చేస్తుందని యూకేలోని పీఓకే సంతతికి చెందిన వారు చెబుతున్నారు. పాక్ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై యూకే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వీరు కోరుతున్నారు. పీఓకే ప్రజలు యూకేలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ముందు భారీగా నిరసనలు చేపట్టారు.
ఇదిలా ఉంటే, పీఓకేలో పాకిస్తాన్ ఆర్మీ నిరసనల్ని తీవ్రంగా అణిచివేస్తోంది. నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో 30 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, ఈ మరణాల సంఖ్య వందకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ చేస్తున్న దురాగతాలకు ఆ దేశాన్ని జవాబుదారీగా ఉంచాలని ప్రపంచ దేశాలను కోరింది.

