NTV Telugu Site icon

Israel-Hamas: కాల్పుల విరమణ గడువుకు కొన్ని నిమిషాల ముందు.. సంధి ఒప్పందం పొడగింపు..

Israel Hamas

Israel Hamas

Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య 50 రోజలు యుద్ధం తర్వాత ప్రస్తుత కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఇరు పక్షాల కూడా బందీలను, ఖైదీలను మార్చుకుంటున్నాయి. తాజాగా గురువారం ఉదయంతో సంధి ముగిసేందుకు కొన్ని నిమిషాల ముందు.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడగిస్తున్నట్లు, సంధి కాలాన్ని పెంచినట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. ఖతార్ వేదికగా ఈ ప్రకటన వెలువడింది. ఇజ్రాయిల్ సైన్యం సంధిని పొడగిస్తు్న్నట్లు తెలిపింది.

బందీలను విడుదల చేసే ప్రక్రియ కొనసాగించేందుకు మధ్యవర్తుల ప్రయత్నాల నేపథ్యంలో నిబంధనలకు లోబడి కార్యాచరణ విరామం కొనసాగుతుందని ఇజ్రాయిల్ ఆర్మీ పేర్కొంది. ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం కూడా పొడగింపును ధృవీకరించింది. బందీలుగా ఉన్న వారి కొత్త జాబితాను విడుదల చేసింది. గత శుక్రవారం ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందం కుదిరింది. ముందుగా నాలుగు రోజులు అనుకున్నప్పటికీ మరో రెండు రోజులు పొడగించారు. ప్రస్తుతం మరోసారి సంధిని పొడగించారు.

Read Also: Telangana Elections2023: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్..

ఇదిలా ఉంటే అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ బుధవారం రాత్రి ఇజ్రాయిల్ చేరుకున్న కొన్ని గంటల తర్వాత విరామం పొడగింపు ప్రకటన వెలువడింది. అంతకుముందు ఖతార్ ప్రధానితో యూఎస్ సీఐఏ, ఇజ్రాయిల్ మొసాద్ అధికారులు భేటీ అయి సంధి పొడగింపు గురించి చర్చించారు. దీనికి ముందు ఖతార్ కూడా హమాస్ నేతలతో చర్చలు జరిపింది.

అక్టోబర్7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేశారు. 1200 మంది హతమార్చారు. మరో 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై భీకరదాడి చేస్తోంది. ఈ దాడుల్లో 16000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 40 శాతం మంది పిల్లలు ఉండటంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాల్పుల విమరణ కోసం ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాలు సంధి ఒప్పందానికి అంగీకరించాయి.