NTV Telugu Site icon

Microsoft Layoffs: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్.. నేటి నుంచే ఉద్వాసన

Microsoft

Microsoft

Microsoft Layoffs: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలు అయిన ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఈ జాబితాలో చేరింది. జనవరి 18 నుంచే ఉద్యోగులకు ఉద్వాసన ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు 2,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 5-10 శాతం మందిని తొలగిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపుగా 11,000 మందిని తొలగిస్తున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ నెలలో మైక్రోసాఫ్ట్ 1000 మంది ఉద్యోగులను తొలగించింది. అంతకు ముందు ఆగస్టులోనూ కొందరిని విధుల నుంచి తప్పించింది. తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది.

Read Also: Assembly Election 2023: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల తేదీలు ఖరారు..

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భనం, ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో టెక్ కంపెనీల లాభాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో పలు సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అన్ని టెక్ కంపెనీలు కూడా తమ వర్క్ ఫోర్స్ లో 5-10 శాతం మందిని తీసేయాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది తొలివారంలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థల్లో కలిపి దాదాపుగా 30,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇదిలా ఉంటే ద్రవ్యోల్భనం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, కోవిడ్ మహమ్మారి ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడింది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ లో కూడా ఆర్థిక మాంద్యం ముందస్తు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మరో 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఖచ్చితంగా ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలు అయిన మెటా, ట్విట్టర్ వంటి సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగింపు ప్రారంభించాయి. మెటా తన ఉద్యోగుల్లో 13 శాతం అంటే 11,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించింది. ఇదే విధంగా ట్విట్టర్ కూడా తన ఉద్యోగుల్లో 50 శాతం అంటే 3700 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దేశీయ టెక్ సంస్థ షేర్ చాట్ కూడా ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 18,000 మందిని తొలగిస్తోంది. రానున్న కాలంలో ఇండియాలోని టెక్ సంస్థలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.