USA: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్, రష్యాల మధ్య స్నేహం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పలుమార్లు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీతో ట్రంప్‌కి పొసగడం లేదు. ఉక్రెయిన్ యుద్ధానికి పుతిన్, ట్రంప్ మార్గాలను వెతుకుతున్నారు. ఇదే సమయంలో, ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన, రక్షణ రంగ వ్యయం 50 శాతం తగ్గించుకుందామనే ప్రతిపాదనకు కూడా పుతిన్ ఓకే చెప్పారు.
Read Also: DK Shivakumar: శశిథరూర్, తాజాగా డీకే శివకుమార్.. కాంగ్రెస్‌లో కలకలం..
ఇదిలా ఉంటే, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో రష్యాని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చైనీయులతో రష్యాకి ఉన్న సంబంధం నుంచి వారిని వేర చేయడంలో మనం పూర్తిగా విజయా సాధిస్తామో లేదో నాకు తెలియదు’’ అని రష్యా గురించి స్పందించారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ రష్యాకి దగ్గర కావడంపై రాజకీయ విశ్లేషకులు ‘‘రివర్స్ నిక్సన్’’ అని పిలువబడే విధానంలో రష్యాని, చైనా నుంచి విడదీసే ప్రయత్నం జరుగుతోందని భావిస్తున్నారు. 53 ఏళ్ల క్రితం అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ చైనాలో పర్యటించడం, రష్యా ప్రయోజనాలను దెబ్బతీసింది. చైనాను అమెరికాకు దగ్గర చేసింది.
రష్యాని చైనాకి ‘‘శాశ్వత జూనియర్ భాగస్వామి’’గా మారితే, రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు అమెరికాకు సమస్యలు కలిగిస్తాయని రూబియో చెప్పారు. దీనిని యూఎస్ ఎప్పటికీ అనుమతించదని ఆయన అన్నారు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంతో, పుతిన్ చైనాకు దగ్గరయ్యారు. మరోవైపు..చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ రూబియో వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ, బీజింగ్ మరియు మాస్కో మధ్య సంబంధాన్ని ఏ మూడవ పక్షం ప్రభావితం చేయదని అన్నారు. చైనా, రష్యాల మధ్య విభేదాలకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు విఫలమవ్వడం ఖాయమని చెప్పారు.