Maldives: లక్షద్వీప్ పర్యటన సమయంలో భారత్ ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యల చేసి మాజీ మంత్రి మరియం షియునా మరోసారి వివాదాస్పద పోస్టు చేశారు. భారత జాతీయ జెండాలో అశోక చక్రాన్ని పోలి ఉన్న గుర్తుతో, మాల్దీవులు ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ)పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు సంచనలనంగా మారింది. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆమె భారతదేశానికి క్షమాపణలు చెప్పారు. ‘‘ నా ఇటీవల సోషల్ మీడియా పోస్టు విమర్శలకు దారి తీసింది. ఈ పోస్టు వల్ల ఏదైనా గందరగోళం లేదా నేరం జరిగినే నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని మరియం షియునా అన్నారు. ఈమె అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకు చెందిన పార్టీకి చెందిన వ్యక్తి.
‘‘మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ ఎండీపీని ఉద్దేశించి చేసిన ట్వీట్ భారతీయ జెండాను పోలి ఉందని నా దృష్టికి వచ్చిందని, ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ఏదైనా అపార్థానికి కారణమైతే నేను హృదయపూర్వకంగా చింతిస్తున్నాను’’అని ఆమె వ్యాఖ్యానించింది. మాల్దీవులుకు భారత్‌తో ఉన్న సంబంధాన్ని ఎంతో గౌరవంగా భావిస్తామని, భవిష్యత్తులో సోషల్ మీడియా కంటెంట్ విషయంలో అప్రమత్తంగా ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు.
మరియం షియునా చేసిన పోస్టు మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ గుర్తు దిక్సూచి, అశోక చక్రాన్ని పోలి ఉంది. దీంతో మరోసారి ఆమెపై భారతీయులు విరుచుకుపడ్డారు. భారత్, మాల్దీవులకు నిత్యావసరాలను సరఫరా చేసేందుకు అంగీకరించిన తర్వాత ఆమె ఈ పోస్టు చేసింది. మహ్మద్ ముయిజ్జూ ఆ దేశ అధ్యక్షుడైన తర్వాత భారత్ తో సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. చైనా అనుకూలంగా వ్యవహరిస్తుండంపై భారత్ ఆగ్రహంగా ఉంది.
గతంలో ప్రధాని మోడీ లక్షదీవుల పర్యటన సమయంలో మంత్రిగా ఉన్న మరియం షియునా, ప్రధానిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇజ్రాయిల్ తోలుబొమ్మ’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. దీంతో ఆమెను మంత్రి వర్గం నుంచి తీసేశారు. ఈమెతో పాటు భారత్‌పై నోరు పారేసుకున్న మరో ఇద్దరు మంత్రుల్ని కూడా సస్పెండ్ అయ్యారు.