Malala Yousafzai: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దారుణమైన దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 1400 మందిని క్రూరంగా చంపేశారు. 200 మందిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు వారిని గాజాలోకి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే హమాస్ ఎటాక్ తర్వాత ఇజ్రాయిల్ వైమానిక దళం గాజా స్ట్రిప్ పై విరుచుపడుతోంది. ఇప్పటి వరకు ఈ దాడుల్లో 3000 మంది మరణించారు. ఇందులో సాధారణ పౌరులతో పాటు పిల్లలు కూడా ఉన్నారు.
మరోవైపు మంగళవారం గాజా నగరంలోని ఓ ఆస్పత్రిలో జరిగిన దాడిలో 500 మంది మరణించారు. ఈ దాడిని ప్రపంచం మొత్తం ఖండించింది. అయితే ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడి వల్లే ఇంత మంది చనిపోయారని హమాస్ ఆరోపించగా.. హమాస్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడి విఫలం కావడంతోనే అల్-అహ్లీ ఆస్పత్రిలో పేలుడు జరిగిందని ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది.
Read Also: Hate Crime: తలపాగా ధరించినందుకు సిక్కు యువకుడిపై దాడి..
ఈ దాడిపై నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ స్పందించారు. పాలస్తీయన్ల కోసం రూ.2.5 కోట్లను విరాళంగా అందించారు. గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై జరిగిన బాంబుదాడిని చూసి నేను భయపడిపోయానని, దీన్ని ఖండిస్తున్నానని ఆమె ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇజ్రాయిల్-పాలస్తీనా శాంతి కోసం నా గొంతును జోడిస్తున్నానని, సామూహిక శిక్ష పరిష్కారం కాదని, గాజాలో ఉన్న జనాభాలో సగం మంది 18 ఏల్ల కంటే తక్కువ వయసు ఉన్న వారే, వారు తమ మిగిలిన జీవితాన్ని బాంబుదాడుల మధ్య జీవించకూడదని మలాలా అన్నారు.
ఈ సంక్షోభ సమయంలో పాలస్తీనా ప్రజల కోసం సాయం చేసే మూడు స్వచ్ఛంద సంస్థలకు తాను రూ. 2.5 కోట్లు విరాళంగా ఇస్తానని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తక్షణ కాల్పుల విరమణకు, శాశ్వత శాంతి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.