Olympics: ఫ్రాన్స్ పారిస్ వేదికగా ఒలింపిక్స్ -2024 గేమ్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. అయితే, ఈ ఒలింపిక్స్‌కి ముందు ఫ్రాన్స్ వ్యాప్తంగా విద్రోహులు రెచ్చిపోయారు. విశ్వ క్రీడలకు విఘాతం కలిగించేలా ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్ సిస్టమ్‌పై దాడి చేశారు. కేబుళ్లను, రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను తలగబెట్టారు. ఒలింపిక్స్ మొదలుకావడానికి కొన్ని రోజుల ముందు ఈ ఘటనలు చోటు చేసుకుంది. రైల్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పారిస్ నగరంలో పాటు పలు ప్రాంతాల్లో లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఇంటర్నెట్, టెలిఫోన్ వ్యవస్థపై కూడా నిరసనకారులు దాడులకు తెగబడ్డారు. ఇలా గందరగోళాల మధ్య ఒలింపిక్స్ గేమ్స్‌ని ఫ్రాన్స్ నిర్వహిస్తోంది.
READ ALSO: Floods : ఢిల్లీ లాంటి దుర్ఘటనలను నివారించేందుకు హైదరాబాద్ సిద్ధమైందా.?
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇమాన్యుయేల్ మక్రాన్ ‘‘ముద్దు’’ వివాదంలో ఇరుక్కున్నారు. ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్రెంచ్ క్రీడా మంత్రి అమేలీ ఓడియా-కాస్టెరాని ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. అధ్యక్షుడు మక్రాన్ మెడపై చేయి వేసి కిస్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారానికి దారి తీసింది. కాస్టెరా, మక్రాన్‌ని చెవి కింద ముద్దు పెట్టుకునే సమయంలో, అతడి మెడపై చేయి వేసినట్లు ఫోటోలు చూపిస్తున్నాయి.
ఈ సమయంలో ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియేల్ అట్టల్ మరోవైపు చూడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ సమయంలో ఎంత ఇబ్బందికరంగా ఉందో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘ఈ ఫోటో అసభ్యకరంగా ఉందని నేను భావిస్తున్నాను, ఇది అధ్యక్షుడికి మరియు మంత్రికి తగినది కాదు’’ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘ బ్రిగెట్టే(మక్రాన్ భార్య) ఇష్టపడదు’’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘ప్రధాని గాబ్రియేల్ అట్టాల్ మరెక్కడో చూస్తున్నట్లు నటిస్తున్నాడు, అతనికి ఎక్కడ నిలబడాలో తెలియదు’’ మరోకరు పోస్ట్ చేశారు. ఫ్రెంచ్ వారు రెండు బుగ్గలపై ముద్దు పెట్టుకుని పలకరించుకుంటారని మరో నెటిజన్ అన్నారు. అయితే, మాజీ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి అయిన క్రీడా మంత్రి తనపై దృష్టిని ఆకర్షించేందుకు ఇలా చేశారని అక్కడి మీడియా పేర్కొంటోంది.