Nepal: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి శుక్రవారం దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. నేపాల్ సార్వభౌమాధికారంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. ఇటీవల, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనలు హింసకు దారి తీశాయి. భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో 51 మంది మరణించారు. అయితే, తాను కాల్పులకు ఆదేశాలు ఇవ్వలేదని, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిగాయని, దేశ పోలీసుల వద్ద అలాంటి ఆయుధాలు లేవని చెప్పారు. ఇదంతా చూస్తుంటే, దీని వెనక ‘‘కుట్ర’’ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.
Read Also: Kiran Abbavaram: మా అన్న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు.. మీ ప్రాణాల కోసం రూల్స్ పాటించండి
ఫేస్ బుక్ పోస్టులో.. ‘‘ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం. 70 సంవత్సరాలు పోరాడిన తర్వాత నేపాల్ ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య గణతంత్రం, సమాఖ్య సమగ్ర వ్యవస్థ, ప్రజల హక్కులు స్థాపించబడిన రోజు.’’ అని ఓలి రాశారు. గత వారం శాంతియుతంగా జరగాల్సిన జెన్-జీ నిరసనల్లో చొరబాటు జరిగిందని, చొరబడిన కుట్రదారులు హింసను సృష్టించారని, మన యువతను చంపారని, పోలీసుల వద్ద లేని ఆటోమెటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపిన సంఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
మరణించిన యువతకు సంతాపం తెలియజేసిన ఓలి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. అల్లర్ల సమయంలో మన రాజ్యాంగపై అతిపెద్ద దాడి జరిగిందని, సింఘా దర్బార్ తగలబడిందని, దేశ చిహ్నాన్ని చెరిపేయడానికి ప్రయత్నించారని, కోర్టులు, వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, నాయకుల ఇళ్లు, వ్యక్తిగత ఆస్తి బూడిదగా మారిందని చెప్పారు. నేపాల్ మొత్తం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
