NTV Telugu Site icon

North Korea: కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది ఈమెనే..

Kim Jong Un’s Daughter, Ju Ae

Kim Jong Un’s Daughter, Ju Ae

North Korea: ప్రపంచంలోనే అత్యంత నిగూఢ దేశంగా ఉత్తరకొరియాకు పేరుంది. అక్కడి ప్రజలకు బయట ఓ ప్రపంచం ఉందనే వాస్తవం చాలా వరకు తెలియదు. వారికి తమ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే వేదం. అంతగా అక్కడ కిమ్ ప్రాపగండా నడుస్తుంది. ఇక అక్కడి నియమాలు, శిక్షలు ప్రపంచంలో మరే దేశంలో కూడా చూడలేము. ఆ దేశానికి తెలిసిందల్లా అమెరికా, వెస్ట్రన్ దేశాలపై వ్యతిరేకత, మిస్సైళ్ల తయారీ. ఇటీవల కాలంలో ఆ దేశం గూఢచార శాటిలైట్ల ప్రయోగాన్ని కూడా చేపట్టింది. మరోవైపు ఉత్తరకొరియాతో రష్యా సంబంధాలు కూడా ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల రష్యా అధినేత పుతిన్ ఆ దేశంలో పర్యటించారు.

Read Also: SP MP Ansari: ఎంపీ అన్సారీకి ఊరట.. 4 ఏళ్ల జైలు శిక్ష ఎత్తివేత

ఇదిలా ఉంటే, ఉత్తర కొరియాకు భవిష్యత్ పాలకుడు ఎవరనే దానిపై అనుమానాలు వీడుతున్నాయి. కిమ్ తర్వాత భవిష్యత్ పాలకురాలిగా అతని కూతురు ‘జూ ఏ’ అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆ దేశాన్ని పాలించడానికి కావాల్సిన శిక్షణ పొందుతున్నట్లు దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ చెప్పింది. కిమ్ ఊబకాయం, అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో తన కూతురిని పాలకురాలిగా చేసేందుకు ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

12-13 ఏళ్ల వయసున్న జూ ఏ ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో తన తండ్రి కిమ్‌లో కలిసి కనిపించింది. ముఖ్యంగా బాలిస్టిక్ మిస్సైళ్ల ప్రయోగ సమయంతో పాటు పలు అధికారిక కార్యక్రమాల్లో దర్శనిమిచ్చింది. అప్పటి నుంచి ఉత్తర కొరియాకు కాబోయే అధినేత ఈమనే అంటూ వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియా మీడియా మార్చిలో జూ ఏని తండ్రి మార్గదర్శకత్వంలో గొప్ప వ్యక్తిగా కొనియాడింది. ఒక వేళ ఆ దేశ తదుపరి అధ్యక్షురాలిగా జూ ఏ ఎన్నికైతే, ఈ దేశాన్ని వరసగా పాలిస్తున్న కిమ్ వంశంలోని నాలుగో వ్యక్తి అవుతోంది. ఇప్పటికే కిమ్ తాతతో పాటు తండ్రి వరసగా అధికారాన్ని చేపట్టారు. కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ తర్వాత కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నాడు.