North Korea: ఎప్పుడూ అణుబాంబుల పేరుతో ప్రపంచ దేశాలను భయపెట్టే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు అమెరికా దెబ్బకు వణికిపోతున్నారు. ఏ క్షణమైనా అగ్రరాజ్యం తనపై విరుచుకుపడొచ్చన్న ఆందోళనతో 54 ఏళ్ల తర్వాత దేశ రాజ్యాంగాన్నే మార్చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అమెరికా దాడిలో తన ప్రాణాలకు ఏమైనా జరిగినా, శత్రువులపై అణుదాడి ఆగకూడదన్న పక్కా వ్యూహంతో కిమ్ కొత్త చట్టాలను తెరపైకి తెచ్చారు. ఇటీవలి కాలంలో అమెరికా దూకుడు చూస్తుంటే కిమ్‌కు కంటిమీద కునుకు కరువైనట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెహ్రాన్‌పై అమెరికా జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం, ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఆ దేశ అణు స్థావరాలను నేలమట్టం చేయడం కిమ్‌ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు తనతో భేటీ అవుతానని చెబుతూనే, ఉత్తర కొరియా అణు ఆయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా ఎప్పుడైనా తమపై యుద్ధం ప్రకటించవచ్చన్న అనుమానంతో కిమ్ ముందుజాగ్రత్త చర్యలకు దిగారు.
తాను లేకపోయినా అణు క్షిపణులు పేలాల్సిందే..
బుధవారం (నవంబర్ 11) విడుదలైన కొత్త రాజ్యాంగంలో కిమ్ తన అణు ఆయుధాల కమాండ్‌ను మరింత పటిష్టం చేసుకున్నారు. ఇప్పటివరకు అణుబాంబు ప్రయోగించే అధికారం కేవలం కిమ్ చేతిలో మాత్రమే ఉండేది. కానీ కొత్త రాజ్యాంగం ప్రకారం, అణు దళాల బాధ్యతను ‘స్టేట్ అఫైర్స్ కమిషన్’కు అప్పగించారు. దీనికి కిమ్ చైర్మన్‌గా ఉన్నప్పటికీ, తన తర్వాత అణు ఆయుధాలను ఎవరు నియంత్రించాలో నిర్ణయించే అధికారాన్ని ఆయన తన వద్దే ఉంచుకున్నారు. అమెరికా దాడిలో తనకు ఏమైనా జరిగినా, ఉత్తర కొరియా అణు క్షిపణులు ఆగకుండా ప్రతీకారం తీర్చుకోవాలన్నదే ఈ మార్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ప్రస్తుతం 50 అణు ఆయుధాలు కలిగిన ఉత్తర కొరియా, 2030 నాటికి ఆ సంఖ్యను 90కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దక్షిణ కొరియాపై మారిన స్వరం.. ఇక శత్రువు కాదు
1972 తర్వాత రాజ్యాంగంలో చేసిన ఈ భారీ సవరణల్లో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. దశాబ్దాలుగా దక్షిణ కొరియాను తమ దేశంలో భాగంగానే చెప్పుకుంటూ, ‘నెంబర్ వన్ శత్రువు’గా చూసిన ఉత్తర కొరియా ఇప్పుడు వెనక్కి తగ్గింది. కొత్త రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం, ఉత్తరాన చైనా, రష్యా ఉన్నట్లే దక్షిణాన ‘రిపబ్లిక్ ఆఫ్ కొరియా’ ఒక ప్రత్యేక పొరుగు దేశమని స్పష్టం చేసింది. అంతేకాదు, దక్షిణ కొరియాను ప్రధాన శత్రువుగా పేర్కొనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించింది. 1950 యుద్ధం తర్వాత సియోల్పై హక్కును వదులుకున్నట్లు సంకేతాలివ్వడం చూస్తుంటే, అమెరికా ఒత్తిడి మధ్య దక్షిణ కొరియాతో శాంతి చర్చలకు కిమ్ సిద్ధమవుతున్నారా అన్న చర్చ మొదలైంది.
అధికారమంతా కిమ్ గుప్పిట్లోనే..
మరోవైపు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 121, 156లలో మార్పులు చేయడం ద్వారా కిమ్ దేశంలోని వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లోకి తీసుకున్నారు. క్యాబినెట్‌ను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోవడంతో పాటు, ఉన్నత స్థాయి న్యాయమూర్తులు, పోలీస్ అధికారుల నియామకాలకు సంబంధించిన పాత రూల్స్‌ను రద్దు చేశారు. అమెరికా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు కిమ్ దేశంలో సర్వాధికారాలను తన చేతుల్లోకి తీసుకున్నారన్నది దీనిని బట్టి అర్థమవుతోంది.

