JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం

  • జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక?
  • అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
  • వైట్‌హౌస్ ఖండన
Jdvance

Jdvance

అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చల నేపథ్యంలో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్యంగా హెచ్చరిక పంపిందని ఓ నివేదిక వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ శాంతి చర్చలను ఆర్థిక లాభాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఇరాన్ ఆరోపించినట్లు డ్రాప్ సైట్ న్యూస్ (Drop Site News) కథనం పేర్కొంది. సున్నితమైన శాంతి చర్చలను స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేశారని జేడీవాన్స్‌కు సమాచారం అందించినట్లు నివేదిక ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది.

డ్రాప్ సైట్ న్యూస్ కథనం ప్రకారం.. జూన్ చివరిలో స్విట్జర్లాండ్‌లోని లేక్ లూసెర్న్ దగ్గర జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల సమయంలో మధ్యవర్తి ద్వారా రహస్య సందేశాన్ని జేడీ వాన్స్‌కు పంపినట్లు ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. జూన్ 17న రూపొందించిన శాంతి ఒప్పంద ముసాయిదాను శాశ్వత ఒప్పందంగా మార్చే ప్రయత్నాలను స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ దెబ్బతీస్తున్నారని ఇరాన్ పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది.

ఇరాన్ ఆరోపణల ప్రకారం.. ఈ ఇద్దరూ శాంతి చర్చల ద్వారా లభిస్తున్న రహస్య సమాచారాన్ని ఉపయోగించి ఆర్థిక మార్కెట్లలో లాభాలు పొందడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఆరోపించింది. అంతేకాకుండా చర్చలకు సంబంధించిన సమాచారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు చేరుతోందన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది. ‘‘జేడీ వాన్స్‌కు ప్రత్యేక మార్గం ద్వారా సమాచారం, విశ్లేషణలను పంపించాం. విట్‌కాఫ్, కుష్నర్ దౌత్య ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు.’’ అని ఇరాన్ అధికారి పేర్కొన్నట్లు కథనంలో వెల్లడైంది.

ఇరాన్ మధ్యవర్తులకు సమర్పించిన పత్రాల్లో ట్రంప్‌కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు యుద్ధం, శాంతి చర్చలకు సంబంధించిన పరిణామాలను ఉపయోగించి ఆర్థిక మార్కెట్లను ప్రభావితం చేశారని ఆరోపించినట్లు నివేదిక తెలిపింది. ఈ చర్యల ద్వారా సుమారు 9 బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించినట్లు ఇరాన్ అంచనా వేసిందని, అందులో 4.5 బిలియన్ డాలర్లు ఇరాన్‌కు కేటాయించాలని కూడా డిమాండ్ చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ ఆర్థిక ఆరోపణలను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినట్లు డ్రాప్ సైట్ న్యూస్ స్పష్టం చేసింది.

వైట్‌హౌస్ ఖండన

ఈ ఆరోపణలను అమెరికా ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించింది. వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సందేశం అమెరికాకు ఎప్పుడూ అందలేదు. ఇరాన్ ప్రచారానికి వేదికగా మారడం విచారకరం.’’ అని వ్యాఖ్యానించారు. మరో అమెరికా అధికారి కూడా.. ‘‘జేడీ వాన్స్ లేదా ఆయన బృందానికి ఇలాంటి సమాచారం ఎప్పుడూ చేరలేదు. అధ్యక్షుడి చర్చల బృందం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.’’ అని స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలపై స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.