Jallianwala Bagh: భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నెత్తుటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ‘‘జలియన్ వాలాబాగ్’’ మారణహోమం. బ్రిటీష్ వాడి వలస చరిత్రపై సిగ్గుపడే గుర్తుగా మిగిలింది. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి 106 ఏళ్లు సమీపిస్తున్న నేపథ్యంలో, ఇది యూకే పార్లమెంట్‌ని కుదిపేస్తోంది. ఇటీవల, బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ ప్రభుత్వం ఈ దారుణంపై అధికారికంగా భారతదేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వలసవాద అణచివేతలో అత్యంత క్రూరమైన చర్యలలో శాశ్వత మచ్చగా మిగిలిందని ఆయన అన్నారు.
ఆయన యూకే పార్లమెంట్‌లో ఏప్రిల్ 13, 1919 నాటి విషాద సంఘటనపై మాట్లాడారు. జనరల్ డయ్యర్ నేతృత్వంలో జరిగిన ఈ ఘటన వేలాది మంది పౌరులు మరణించేలా, గాయపడేలా చేసింది. ఈ చీకటి అధ్యాయాన్ని బ్రిటిష్ చరిత్రలో ఒక మరకగా అభివర్ణించారు. బ్లాక్‌మన్ జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని వివరిస్తూ..‘‘ ప్రజలు జలియన్ వాలాబాగ్ ఎండలో శాంతియుతంగా సమావేశమయ్యారు. అయితే, బ్రిటిష్ దళాలు ఆ ప్రాంతంలో నిరాయుధులైన వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఉచకోత ముగిసే సమయానికి 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1200 మంది గాయపడ్డారు’’ అని అన్నారు.
Read Also: Dokka Seethamma: పవన్ కళ్యాణ్ మాటలతో ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’
2019లో అప్పటి యూకే ప్రధాని థెరిసా మే ఊచకోతను అంగీకరించారని, కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదని బ్లాక్‌మన్ ప్రస్తావించారు. ఆమె ఈ ఘటనకు క్షమాపణలు చెప్పలేదని అన్నారు. ఈ ఘటనపై భారత ప్రజలకు అధికారికంగా బ్రిటన్ పార్లమెంట్ క్షమాపణ ప్రకటన జారీ చేయగలదా..? అని ప్రవ్నించారు. బ్లాక్‌మన్‌కి మద్దతుగా సభా నాయకురాలు లూసీ పావెల్ కూడా ఇది బ్రిటిష్ వలసపాలనలో సిగ్గుచేటు సంఘటన అని అన్నారు.
1919 ఏప్రిల్ 13న జనరల్ రెజినాల్డ్ డయ్యర్ నేతృత్వంలో పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరంలోని జలియన్ వాలాబాగ్‌లో శాంతియుతంగా సమావేశమైన ప్రజలపైకి కాల్పులు జరిపారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలను ఎలాంటి విచారణ లేకుండా జైలులో పెట్టడానికి తీసుకువచ్చిన ‘‘రౌలత్’’ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు గుమిగూడారు. జలియన్ వాలాబాగ్ అన్ని ద్వారాలను మూసేసిన బ్రిటీష్ దళాలు దాదాపు 10 నిమిషాల పాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. మహిళలు, పిల్లలతో సహా 1500 మందికి పైగా మరణించారు. ఇది భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక మలుపుగా నిలిచింది. ఇది భారతీయుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించి, బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛ కోసం మరింతగా పోరాడేందుకు దోహదపడింది.