Site icon NTV Telugu

India-US: వాణిజ్య ఒప్పందంపై శుభవార్త.. జైశంకర్ కీలక ట్వీట్

India Us

India Us

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై కీలక అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు తర్జన భర్జన జరుగుతున్నాయి. చర్చలు ఫలించకపోవడంతో ఇరు దేశాల మధ్య దూరం నడుస్తోంది. ప్రస్తుతం అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మంచి సంభాషణ జరిగినట్లుగా జైశంకర్ పేర్కొన్నారు. వాణిజ్యం, కీలక ఖనిజాలు, అణు సహకారం, రక్షణ, ఇంధనం గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర విషయాలపై కూడా ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని అంగీకరించినట్లుగా స్పష్టం చేశారు. త్వరలోనే రెండు దేశాలు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుందని వెల్లడించారు.

వాణిజ్య అంశాలపై ఇరుపక్షాలు చర్చిస్తామని అమెరికా రాయబారి సెర్గియా గోర్ వెల్లడించిన ఒక రోజు తర్వాత జైశంకర్-మార్కో రూబియో మధ్య వాణిజ్య చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గియా గోర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. ట్రంప్-మోడీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. త్వరలోనే ట్రంప్ భారత్‌కు వస్తారని పేర్కొన్నారు. మొత్తానికి రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

గతేడాది ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. తొలుత భారత్‌పై 25 శాతం సుంకం విధించగా.. అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లు అయింది. తాజాగా ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించే దేశాలపై అదనంగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్‌పై 75 శాతం సుంకం విధించినట్లైంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి.

 

Exit mobile version