ఆ జంట అందమైన జంట. చూడముచ్చటైన జంట. చిలకాగోరింకల్లా ఉన్నారు. వివాహం అనే బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని కలలు కన్నారు. కోరుకున్న చెలిమి దొరికిందని ఎంతగానో మురిసిపోయాడు. జెరూసలేంలో ఆమెకు ప్రపోజ్ చేసేందుకు ఉంగరం కూడా తీసుకున్నాడు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొస్తుందని ఊహించలేకపోయాడు. ఓ దుర్మార్గుడు అకస్మాత్తుగా వచ్చి కాల్పులకు తెగబడడంతో అక్కడికక్కడే జంట నేలకొరిగింది. ఈ విషాద ఘటన వాష్టింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర చోటుచేసుకుంది. దుండగుడి కాల్పుల్లో ఇద్దరు దౌత్యవేత్తలు ప్రాణాలు వదిలారు.
ఇది కూడా చదవండి: US: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు.. విదేశీ విద్యార్థులకు చేర్చుకోవద్దని హుకుం
గాజా-ఇజ్రాయెల్ మధ్య కొన్ని నెలలుగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే బుధవారం వాషింగ్టన్‌లో యూదు మ్యూజియంలో అమెరికా విదేశాంగ ఇచ్చిన విందుకు హాజరై తిరిగి వస్తున్న ఇజ్రాయెల్ యువ దౌత్యవేత్తలు యారోన్ లిపిన్‌స్కీ, సారా మిలిగ్రిమ్‌ను ఓ దుండగుడు అడ్డుకున్నాడు. వారి మతాన్ని.. వారి ప్రాంతాన్ని కనుక్కున్నాడు. అంతే వెంటనే తుపాకీ తీసుకుని కాల్పులకు తెగబడ్డాడు. సంఘటనాస్థలిలోనే యువ జంట ప్రాణాలు కోల్పోయింది.
ఇది కూడా చదవండి: Monsoon: వాన కబురు.. 2 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
యారోన్ లిపిన్‌స్కీ, సారా మిలిగ్రిమ్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే వీరిద్దరికీ నిశ్చితార్థం జరగనుంది. అయితే ప్రియురాలికి ప్రపోజ్ చేసేందుకు యారోన్ లిపిన్‌స్కీ బంగార ఉంగరం కొనుగోలు చేశాడు. త్వరలో జెరూసలేంలో ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తెలిపింది. కానీ మృత్యువు ఈ రూపంలో వస్తుందని ఊహించలేకపోయాడు. కోరుకున్న చెలిమి దొరికింది. ఆమెతో కలకాలం జీవించాలని యారోన్ లిపిన్‌స్కీ భావించాడు. కానీ ముష్కరుడి కాల్పుల్లో యువ జంట ప్రాణాలు కోల్పోవడం అందరి హృదయాలను కలిచివేసింది.
ఇక దుండగుడు షికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్‌గా గుర్తించారు. కాల్పుల సమయంలో దుండగుడు.. పాలస్తీనాకు స్వేచ్ఛ ఇవ్వాలంటూ నినాదాలు చేశాడు. కాల్పుల అనంతరం యూదు మ్యూజియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా అధికారులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. యూదులపై విద్వేషంతోనే ఈ హత్య జరిగిందని అన్నారు. ‘‘అమెరికాలో ద్వేషం మరియు రాడికలిజానికి స్థానం లేదు. ఇలాంటివి జరగడం చాలా బాధాకరం! దేవుడు మీ అందరినీ దీవించుగాక! అని సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొ్న్నారు.
ఇక యువ జంట హత్యను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఈ చర్య యూదు వ్యతిరేక చర్యగా పేర్కొ్న్నారు. యువ జంటను కోల్పోవడం విచారకరమన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాల దగ్గర భద్రతను పెంచాలని ఆదేశించారు. తమకు అండగా నిలిచిన అమెరికాకు నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ ఖండన..
ఇక ఇజ్రాయెల్ దౌత్యవేత్తల హత్యను భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా ఖండించారు. దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని పేర్కొన్నారు.