NTV Telugu Site icon

Iran: ఇజ్రాయిల్ ఎంబసీలు ఇక ఎంత మాత్రం సేఫ్ కావు.. ఇరాన్ వార్నింగ్..

Iran

Iran

Iran: సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఆ దేశానికి చెందిన కీలక మిలిటరీ అధికారులు మరణించారు. దీంతో అప్పటి నుంచి ఇరాన్ రగిలిపోతోంది. ఇజ్రాయిల్‌పై దాడి చేసేందుకు సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ దాడి చేస్తుందనే భయంతో ఇజ్రాయిల్ అంతటా హైఅలర్ట్ నెలకొంది. ఇదిలా ఉంటే ఏ ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం కూడా ఇకపై సురక్షితంగా ఉండబోదని ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీకి సైనిక సలహాదారు జనరల్ రహీమ్ సఫావి హెచ్చరించారు. అయితే, ఈ దాడిలో ఇజ్రాయిల్ తమ ప్రమేయాన్ని అంగీకరించలేదు. ఎలాంటి ప్రతిస్పందనకైనా ఇజ్రాయిల్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఎవరైనా ఇజ్రాయిల్‌కి హాని చేయాలనుకున్నా, హాని చేసేందుకు ప్లాన్ చేసినా వారిని అంతమొందిస్తామని చెప్పారు.

Read Also: Boat Sink: విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి..

ఇటీవల సిరియాపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు జనరల్స్‌తో పాటు 13 మంది మరణించారు. ఇరానియన్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ మహ్మద్ రెజా జహేదీ మరణించారు. ఇరాన్ అత్యున్నత మిలిటరీ అధికారి చనిపోవడంతో ఆ దేశం ఇజ్రాయిల్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. 2020లో యూఎస్ డ్రోన్ దాడిలో ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించారు. ఈ దాడి తర్వాత రెజా జహేదీ మరణం అత్యున్నత స్థాయి హత్యగా పరిగణించబడుతోంది. ఈ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏ క్షణాన ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ వివాదానికి అమెరికా దూరంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. తమ స్థావరాలపై, తమ వారిపై దాడులు చేయొద్దని ఇరాన్‌ని అమెరికా కోరింది.

మరోవైపు గాజా యుద్ధంలో కీలక పరిణామం ఏర్పడింది. అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయిల్-హమాస్ పోరులో దక్షిణ గాజా నుంచి ఇజ్రాయిల్ పాక్షికంగా తమ బలగాలను ఉపసంహరించుకుంది. మరోవైపు రెండు పక్షాల మధ్య సంధి కోసం ఈజిప్ట్, ఖతార్ వంటి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, బందీల విడుదల చేస్తే తప్పితే, తాము కాల్పుల విరమణ ప్రకటించేది లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.