NTV Telugu Site icon

Israel-Hamas War: గాజా అల్-షిఫా ఆస్పత్రి కింద టెర్రరిస్ట్ టన్నెల్.. వీడియో షేర్ చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ.

Israel Hamas War

Israel Hamas War

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇటీవల గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నానుతోంది. ఈ ఆస్పత్రి కిందనే భారీ సొరంగాలు ఉన్నాయని, టెర్రరిస్టుల టన్నెల్ నెట్వర్క్ ఉందని ఇజ్రాయిల్ ఆర్మీ ఆరోపిస్తోంది. తాజాగా ఈ ఆస్పత్రి కిందనే అతిపెద్ద ఉగ్రవాద సొరంగాన్ని ఇజ్రాయిల్ ఆర్మీ కనుగొంది. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది.

ఈ టన్నెల్‌లోకి వెళ్లిన ఇజ్రాయిల్ సైనికులు అక్కడ ఉన్న నిర్మాణాలను వీడియోలో బంధించారు. ‘‘మేము ప్రత్యేక దళాలతో లోపలికి వెళ్లాము. ఎందుకంటే అక్కడ ఓ గిడ్డంగి ఉంది. అక్కడ మందుగుండు సామాగ్రి, తుపాకులు, పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉంది’’ అని ఐడీఎఫ్ అధికారి చెప్పారు. 10 మీటర్ల లోతైన షాఫ్ట్ కారిడార్, ఆ తర్వాత బ్లాస్ట్ ఫ్రూఫ్ డోర్ ఉందని సైనికాధికారి పేర్కొన్నారు.

మొదటిసారి మేము అల్ షిఫా కాంప్లెక్స్ లోపలికి వెళ్లినప్పడు బాంబు- స్నిఫింగ్ కుక్కలతో లోపలికి వెళ్లామని, ట్రక్కు పరిమాణంలో మందుగుండు సామాగ్రిని కనుగొన్నామని ఆమె పేర్కొన్నారు. టన్నెల్ లోపల రూములు, కిచెన్, వాష్ రూం, ఏసీ సౌకర్యం, విద్యుత్ సౌకర్యాలు ఉన్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది.

Read Also: Priyanka Gandhi: మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక ప్రసంగం

గత రాత్రి అల్ షిఫా ఆస్పత్రి డైరెక్టర్‌తో పాటు ఇతర డాక్టర్లను ఇజ్రాయిల్ అరెస్ట్ చేసింది. అల్ షిఫా ఆస్పత్రి హమాస్ కమాండ్ సెంటర్‌‌గా ఉందని, దాని కింద టన్నెల్ నెట్వర్క్ ద్వారా హమాస్ తన కార్యకలాపాలకు పాల్పడుతోందిన ఇజ్రాయిల్ పదేపదే ఆరోపిస్తోంది. బందీలు ఇక్కడే ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దారుణమైన దాడికి పాల్పడింది. 1200 మందిని ఉగ్రవాదులు ఊచకోత కోశారు. మరో 240 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిని ప్రస్తుతం గాజాలోని రహస్య ప్రాంతాల్లో దాచారు. మరోవైపు ఇజ్రాయిల్ దాడుల వల్ల గాజాలో 13 వేల మంది ప్రజలు మరణించారు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ సంధి ఒప్పందం జరిగింది. నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ కాలంలో 50 మంది బందీలను హమాస్ విడుదల చేస్తే, 150 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయిల్ విడుదల చేయనుంది.