Iran Protests: ఇరాన్ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. మరోవైపు, నిరసనల్ని అణిచివేసేందుకు మతప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ పరిణామాలను అగ్రరాజ్యం అమెరికా నిశితంగా గమనిస్తోంది. ఇరాన్ ‘‘పెద్ద ఇబ్బందుల్లో’’ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘‘ఇరాన్ పెద్ద ఇబ్బందుల్లో ఉంది. కొన్ని వారాల క్రితం నిజంగా సాధ్యమేనా అని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని నగరాలను ప్రజలు స్వాధీనం చేసుకున్నట్లు నాకు అనిపిస్తోంది’’ అని ట్రంప్ అన్నారు.
Read Also: Bhartha Mahasayu Laku WignyaPthi : సెన్సార్ కంప్లీట్ చేసుకున్న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ..
ఇదిలా ఉంటే, ఇరాన్ వ్యాప్తంగా అస్థిర పరిస్థితులు ఏర్పడటంతో అమెరికా జోక్యం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై యూఎస్ దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయిల్ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ హైఅలర్ట్‌లో ఉంది. ఇరాన్ పరిణామాల గురించి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ మాట్లాడుతూ.. ఇరాన్ ఇజ్రాయిల్‌పై దాడి చేస్తే భయంకరమైన పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇరాన్ పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, అంతర్గత అస్థిరత ఇజ్రాయిల్ వ్యూహాత్మక లెక్కల్ని ప్రభావితం చేస్తుందని అన్నారు.
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శనివారం ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు ఇజ్రాయిల్ వర్గాలు తెలిపాయి. ఈ చర్చల్లో ఇరాన్‌లో అమెరికా జోక్యం చేసుకునే అవకావం ఉందని తెలుస్తోంది. గతంలో ఇరాన్ నిరసనల గురించి ట్రంప్ మాట్లాడుతూ.. నిరసనకారులకు హాని కలిగిస్తే, అమెరికా జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
