Israel: మధ్యప్రాచ్చంలో ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం రోజు జెరూసలెంలోని ప్రఖ్యాత అల్-అక్సా మసీదులో ఘర్షణ తర్వాత ఇజ్రాయిల్ వరసగా దాడులను ఎదుర్కొంటోంది. అల్-అక్సా ఘటన తర్వాత పాలస్తీనా గాజా నుంచి, లెబనాన్ నుంచి రాకెట్ దాడులను ఎదర్కొంది ఇజ్రాయిల్. దీనికి ప్రతీగా ఇజ్రాయిల్ పాలస్తీనా, లెబనాన్ పై వైమానిక దాడులు చేస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయిల్ వాణిజ్య నగరం, వెస్ట్ బ్యాంక్ టార్గెట్ గా పాలస్తీనా దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. ఇందులో ఇటలీకి చెందిన ఓ మహిళ కూడా ఉంది. ఈ దాడుల తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు పోలీస్, ఆర్మీ రిజర్వ్ దళాలను సమీకరణకు ఆదేశాలు ఇచ్చారు. యూదుల పాస్ ఓవర్, ముస్లింల రంజాన్ మాసం ఇజ్రాయిల్ లో ఉద్రిక్తతకు కారణం అయింది. అల్-అక్సా మసీదులో ఇజ్రాయిల్ దళాలు పాలస్తీనియన్లలో ఘర్షణ జరిగిన తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Read Also: Accused Of Gang Raping: అత్యాచారం కేసులో 21 మంది పోలీసులు.. నిర్దోషులుగా విడుదల
సెంట్రల్ టెల్ అవీవ్ లో సముద్ర తీరం వెంబడి నడుస్తున్న వ్యక్తులపైకి కారు దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మరణించాడు. మరో ఏడుగురు వ్యక్తుల గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు అంతం చేశాయి. వెస్ట్ బ్యాంకులో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలకు పాల్పడిన నేరస్తుల కోసం ఇజ్రాయిల బలగాలు గాలింపు చర్యలను చేపట్టింది.
అంతకుముందు లెబనాన్, పాలస్తీనా జరిపిన దాడుల తర్వాత ఇజ్రాయిల్ హమాస్ ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. రాకెట్ల ద్వారా ఇజ్రాయిల్ పైకి చేసిన దాడులను ఇజ్రాయిల్ క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ఐరన్ డోమ్’ దాడులను అడ్డుకుంది. ఈ ఉద్రిక్తతలపై ఐరాస చీఫ్ ఆంటోనియోగుటెరస్ సంయమనం పాటించాలని ఇరు దేశాలను కోరారు. అమెరికా, ఫ్రాన్స్ కూడా ఇలాగే స్పందించాయి.