Site icon NTV Telugu

Israel-Iran war: ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్.. ఇరాన్ ఘర్షణతో భయం..

Pakistan

Pakistan

Israel-Iran war: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మిడిల్ ఈస్ట్ దేశాలను ఆందోళనపరుస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయిల్‌పై వందలాది క్షిపణులతో దాడులు చేసింది. అయితే, ఇప్పుడు ఈ పరిణామాలు పాకిస్తాన్‌ని భయపెడుతున్నాయి. ఇజ్రాయిల్ మొత్తం ముస్లిం ప్రపంచంపై ‘‘క్రూసేడ్’’ ప్రారంభించిందని, గాజా, లెబనాన్, సిరియా, యెమెన్, ఇప్పుడు ఇరాన్‌పై దాడులు చేస్తున్నారని, తర్వాత హిట్ లిస్ట్‌లో తామే ఉంటామని పాకిస్తాన్ భయపడుతోంది.

ఇటీవల పాకిస్తాన్ ఎంపీ అసద్ కైజర్ ఆ దేశ పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇజ్రాయిల్ నెక్ట్స్ టార్గెట్ పాకిస్తాన్ కావచ్చని, భారత్-ఇజ్రాయిల్ మధ్య సైనిక సహకారం ఇస్లామాబాద్‌కు అతిపెద్ద ముప్పు అని హెచ్చరించాడు. పాకిస్తాన్, ఇరాన్‌తో సరిహద్దు పంచుకుంటున్నందున ఇజ్రాయిల్ మనపై కూడా దాడి చేయగలదని హెచ్చరించారు.

Read Also: Donald Trump: ‘‘నేను భారత్-పాకిస్తాన్‌కు చేసినట్లే..’’ ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఒప్పందం..

“ఇటీవల జరిగిన భారతదేశం-పాకిస్తాన్ వివాదంలో, భారత దళాలు ఉపయోగించిన డ్రోన్‌లు, మందుగుండు సామగ్రిలో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ తయారు చేసినవే” అని ఆయన అన్నారు. “అల్లాహ్ దయ చూపాలి, ఇరాన్ తర్వాత, దాని (ఇజ్రాయెల్) తదుపరి లక్ష్యం పాకిస్తాన్ కావచ్చు” అని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు పాకిస్తాన్ మద్దతుగా నిలవాలని ఎంపీ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు.

ఇజ్రాయిల్ భీకర దాడి:

ఇరాన్ అణ్వాయుధాలు నిర్మిస్తుందనే అనుమానంతో ఇజ్రాయిల్ ఇరాన్ అణు స్థావరాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఇరాన్‌పై అత్యంత తీవ్రమైన దాడిని ప్రారంభించింది, శుక్రవారం నాడు రాజధాని టెహ్రాన్‌తో సహా ఇరాన్ నగరాలపై ఆపరేషన్ రైజింగ్ లయన్ కింద తెల్లవారుజామున వైమానిక దాడులు చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్(IRGC) చీఫ్ హోస్సేన్ సలామి, కమాండర్ గులామ్-అలీ రషీద్, అణు శాస్త్రవేత్త డాక్టర్ మొహమ్మద్ టెహ్రాన్చి, అణు శాస్త్రవేత్త డాక్టర్ ఫెరేడూన్ అబ్బాసి, ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరితో సహా అనేక మంది అగ్ర ఇరాన్ అణు శాస్త్రవేత్తలు, సైనిక కమాండర్లను హతమార్చింది. శుక్రవారం, శనివారం మధ్య రాత్రి, ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయిల్‌పై దాడులు చేసింది.

Exit mobile version