Site icon NTV Telugu

Israel-Iran Conflict: ఇరాన్‌పైకి మిస్సైల్ ప్రయోగించిన ఇజ్రాయిల్..

Israel Fires Missiles At Iran

Israel Fires Missiles At Iran

Israel-Iran Conflict: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు మిడిల్ ఈస్ట్‌లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. అయితే, ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ చెప్పింది. ఇదిలా ఉంటే ఇరాన్‌లోని ఒక సైట్‌పైకి ఇజ్రాయిల్ క్షిపణిని ప్రయోగించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా అధికారిని ఉటంకిస్తూ ఏబీసీ న్యూస్ గురువారం ఆలస్యంగా ఈ విషయాన్ని నివేదించింది. ఇరాన్ నగరంలోని ఇసాఫహాన్‌లోని విమానాశ్రయంలో పేలుడు శబ్దం వినిపించిందని, అయితే కారణం వెంటనే తెలియరాలేదని ఇరాన్‌కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. దీంతో అనేక విమానాలు ఇరాన్ గగనతలం నుంచి మళ్లించబడ్డాయని సీఎన్ఎన్ తెలిపింది.

Read Also: Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకి‌ ఎందుకు లాగుతున్నారు.. బండిసంజయ్‌ పై పొన్నం ఫైర్‌

ఏప్రిల్ 1న ఇజ్రాయిల్, సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కి చెందిన ఇద్దరు కీలక జనరల్స్‌తో పాటు పలువురు ఇరాన్ అధికారులు మరణించారు. అయితే, ఈ దాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ గత శనివారం ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా వరకు ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లను ఆకాశంలోనే అడ్డుకుని కుప్పకూల్చాయి. గురువారం ఐక్యరాజ్యసమితి ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయిల్ తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏదైనా తదుపరి సైనిక చర్యలకు పాల్పడకుండా ఆపాలని ఇరాన్ యూఎన్‌కి చెప్పింది.

Exit mobile version