NTV Telugu Site icon

Israel-Hamas: ఇజ్రాయెల్ దూకుడు చర్య.. గాజాలో విద్యుత్ సరఫరా నిలిపివేత

Gazapower

Gazapower

గాజా-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరోసారి తీవ్రమవుతున్నాయి. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో సర్వనాశనం అయింది. ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా పరిస్థితులు సద్దుమణిగాయి. అంతా బాగున్నాయి అనుకుంటున్న సమయంలో మరోసారి పరిణామాలు తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇటీవల హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిసింది. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు కొద్దిమంది మాత్రమే విడుదలయ్యారు. దీంతో తొలి విడత ఒప్పందాన్ని కొనసాగించాలని.. మొత్తం బందీలందరినీ విడుదల చేయాలని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. అందుకు హమాస్ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో గాజాకు వెళ్లే సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీంతో నిత్యావసరాల ట్రక్కులన్నీ కూడా సరిహద్దుల్లోనే నిలిచిపోయాయి. దీంతో ఆహార సంక్షోభం ఏర్పడింది. తాజాగా ఇజ్రాయెల్ మరో చర్యకు దిగింది. ఇజ్రాయెల్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ను నిలిపివేసింది. దీంతో గాజాలో అంధకారంతో పాటు.. నీటిని శుద్ధి చేసే ప్లాంట్లన్నీ నిలిచిపోయాయి. దీంతో ఆకలితో పాటు నీళ్ల కొరత కూడా ఏర్పడింది. పరిస్థితులు మరింత ధీన స్థితికి దిగజారిపోయాయి.

అయితే ఈ చర్యను హమాస్ ఖండించింది. ఇజ్రాయెల్ బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించింది. రెండో దశ ఒప్పందాన్ని చేసుకోవాలని హమాస్ తెలిపింది. ఇందుకోసం వెంటనే చర్చలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. అయితే మొదటి దశ ఒప్పందాన్నే ఏప్రిల్ వరకు కొనసాగించాలంటూ ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. దీంతో ఇరువర్గాల చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. అంతేకాకుండా గాజాకు సాయం నిలిచిపోయింది.

అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. గాజాను ధ్వంసం చేసింది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని.. లేదంటే నరకం చూస్తారని హమాస్‌ను తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా గాజాను ఖాళీ చేయాలని.. అభివవృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలను అరబ్ దేశాలు ఖండించాయి. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. అమెరికా పర్యటనలో కూడా ట్రంప్ ఇవే వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఒకేసారి బందీలు విడుదల కోసం హమాస్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడి పెంచుతోంది. దీనికి హమాస్, అంతర్జాతీయ మధ్యవర్తులు ఎలా స్పందిస్తారో చూడాలి.