రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నిర్ణయాత్మక స్థితికి చేరుకుంది. రష్యా సైనిక దాడి ప్రారంభించి 12 రోజులు అవుతోంది. తన డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి మళ్లేది లేదని పుతిన్ అంటున్నాడు. మరోవైపు, రష్యా దాడులను నిలువరించాలన్న ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్‌స్కీ విజ్ఞప్తిపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ ప్రారంభించించింది. రష్యా దాడులను జెలెన్‌స్కీ టెర్రరిజంతో పోల్చాడు. అది యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు -ఐసీసీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఉక్రెయిన్ మిలటరీని మాత్రమే లక్ష్యంగా చేసుకుని సైనిక దాడి చేస్తున్నామని రష్యా మొదట చెప్పింది. కానీ చెప్పిన దానికి చేస్తున్నదానికి పొంతన లేదు. జనావాసాలు, సామాన్యులు లక్ష్యంగా విరుచుకు పడుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రష్యా యుద్ధ నేరాలపై దర్యాప్తు చేయాలని 39 దేశాలు కోరడంతో ఐసీసీ విచారణ మొదలు పెట్టింది. మరోవైపు, ఈ ఆరోపణలను రష్యా ఖండిస్తోంది.
అయితే.. యుద్ధ నేరం అంటే ఏమిటో తెలుసుకోవటం ఈ సందర్బంలో ముఖ్యం. అంతర్జాతీయ చట్టాలు దానిని ఎలా నిర్వచించాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మానవళి చరిత్రలో కనీవిని ఎరుగని విధ్వంసం రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించింది. ఐదు కోట్ల మంది ప్రజలు చనిపోయారు. యుద్దం ముగిసిన తరువాత 1949లో స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో వివిధ దేశాధి నేతలు సమావేశమయ్యారు. దీనినే జెనీవా కన్వెన్షన్ అని అంటారు. ఆ సమయంలోనే యుద్ధ నియమాలను రూపొందించారు. యుద్ధ నేరాలను నిర్వచించే పలు చట్టాలు కూడా జెనీవా ఒప్పందాల్లో ఉన్నాయి. వీటిని 196 దేశాలు గుర్తించాయి.
ఈ ఒప్పందాల ప్రకారం ఒక దేశం మరొక దేశంపై దాడికి దిగినప్పుడు ఉద్దేశపూర్వకంగా చంపడం, హింసించడం, అమానవీయంగా ప్రవర్తించడం, ఉద్దేశపూర్వకంగా తీవ్రంగా బాధపెట్టడం, గాయపరచడం,ఆస్తులను తీవ్రంగా ధ్వంసం చేయడం, వాటిని స్వాధీనం చేసుకోవడం, బందీలుగా పట్టుకోవడం, చట్ట విరుద్ధంగా బహిష్కరించడం లేదా నిర్బంధించడం. ఈ చర్యలన్నిటిని యుద్ధ నేరాలుగా పరగణిస్తారు.
సాయుధ పోరాటాలకు సంబంధించి 1998 నాటి రోమ్ శాసనం మరొక ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందం. సాయుధ పోరులో ఏ ఏ చర్యలు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందికి వస్తాయో ఇది చెబుతుంది. దాని ప్రకారం సాయుధ పోరాటంలో పాల్గొనని పౌర సమూహాలు, వ్యక్తులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం నేరం. దాడి చేయడం వల్ల పౌరుల ప్రాణాలకు అపార నష్టం జరుగుతుందని, ఎంతో మంది గాయపడతారని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం నేరం. రక్షణ వ్యవస్థలు లేని పట్టణాలు, గ్రామాలు, నివాసాలు, భవనాలపై దాడులు, బాంబు దాడులు చేయడం, ఆస్పత్రులు, స్కూళ్లు, మతపరమైన భవనాలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయకూడదని ఇది స్పష్టం చేస్తోంది.ఈ యుద్ద నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ జరుపుతుంది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ చేతిలో లక్షలాది మంది యూదులు, ఇతర పౌరులు చనిపోయారు. సామాన్య ప్రజలు, యుద్ధ ఖైదీల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడం, దానికి కారణమైన వారిపై నాటి మిత్ర రాజ్యాలు విచారణ జరిపించాయి. 1945, 1946లో నూరెంబర్గ్ విచారణలో పలువురు నాజీ నేతలకు మరణ శిక్ష పడింది.1948లో ఇలాంటి ప్రక్రియే టోక్యోలో మొదలైంది. కొందరు జపాన్ మిలటరీ కమాండర్లను ఉరి తీశారు. ఈ విచారణ ప్రక్రియ తరువాత కాలంలో పలు విచారణలకు మార్గం చూపించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక సాయుధ పోరాటాల్లో చోటు చేసుకున్న యుద్ద నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ జరిపింది. దోషులగా తేలిన పలువురికి శిక్షలు కూడా పడ్డాయి.
ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని కీయెవ్, ఖార్కియెవ్ ఖేర్సన్ నగరాలపై ఇటీవల తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఖార్కియెవ్‌పై రష్యా చేసిన వైమానిక దాడుల్లో పౌరులు మరణించారని, యుద్ధ నేరాలకు రష్యా పాల్పడిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. నగరంపై చేసిన మరో దాడిలో రష్యా, క్లస్టర్ బాంబులను ఉపయోగించిందనే ఆరోపణ కూడా ఉంది. 2008లో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం క్లస్టర్ బాంబులను చాలా దేశాలు నిషేధించాయి. ఐతే, రష్యా, యుక్రెయిన్ ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు.
ఈ దాడుల్లో రష్యా వాక్యూమ్ బాంబులను కూడా ఉపయోగించిందని ఆరోపణలు వచ్చాయి. దీనిని ప్రయోగించినపుడు విస్ఫోటనంతో ఒక శూన్యం ఏర్పడుతుంది. అది పరిసరాల్లోని ఆక్సిజన్ అంతటినీ పీల్చివేస్తుంది. ఈ బాంబుల వినియోగాన్ని నిషేధించే అంతర్జాతీయ చట్టాలేవీ లేవు. కానీ ప్రజలు ఉన్న ప్రాంతాలు, స్కూళ్లు, ఆస్పత్రులపై ఈ బాంబులు ప్రయోగిస్తే మాత్రం 1899, 1907 ది హేగ్ ఒప్పందాల ప్రకారం యుద్ధ నేరం కిందికి వస్తుంది.
మరోవైపు తాము ఈ యుద్ధ నేరాలకు పాల్పడినట్టుగానీ, క్లస్టర్ బాంబులు, వాక్యూమ్ బాంబులు వాడినట్లుగానీ రష్యా అంగీకరించడం లేదు. అవన్నీ తప్పుడు వార్తలు అంటూ కొట్టి పారేస్తోంది. మరి న్యాయస్తానం ఏం చెబుతుందో చూడాలి.