Iran-US Tensions: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ఇప్పటికే హెచ్చరిస్తున్న ఇరాన్ తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా ముందస్తు హెచ్చరిక రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. అమెరికాకు ఇది తీవ్రమైన హెచ్చరిక అని పేర్కొంది. మరోసారి ఇరాన్‌పై దాడులు చేసినా, తమ సరిహద్దులను ఉల్లంఘించినా గతంలో కంటే మరింత కఠినంగా బదులిస్తామని హెచ్చరించింది.
ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. ఇరాన్‌లోని సిరిక్ ప్రాంతంలో ఉన్న టెలికమ్యూనికేషన్ టవర్‌పై అమెరికా వైమానిక దాడి చేసిందని IRGC ఆరోపించింది. దీనికి ప్రతీకారంగా తమ ఏరోస్పేస్ దళాలు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అమెరికా దాడి జరిగిన సుమారు గంటలోపే బహ్రెయిన్ ద్వీపంలో ఉన్న అమెరికా సైన్యానికి చెందిన ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని, దానిని ధ్వంసం చేసినట్లు IRGC తన ప్రకటనలో పేర్కొంది.
అమెరికా వైమానిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, తమపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించడమే ఈ చర్య వెనుక ఉద్దేశమని తెలిపింది. అంతేకాకుండా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో అమెరికా చమురు అక్రమ రవాణాకు పాల్పడుతోందని కూడా ఇరాన్ ఆరోపించింది.
తమ దేశ సరిహద్దులను మరోసారి ఉల్లంఘించి, దూకుడు చర్యలకు పాల్పడితే తీవ్రంగా స్పందిస్తామని IRGC అమెరికాకు హెచ్చరిక జారీ చేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా రాడార్‌ను ధ్వంసం చేయడం శత్రువులకు ఇచ్చిన తీవ్రమైన హెచ్చరిక మాత్రమేనని పేర్కొంది. అమెరికా వైమానిక కవ్వింపు చర్యలు, హార్ముజ్ జలసంధిలో చమురు అక్రమ రవాణాను అడ్డుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించింది. అమెరికా మరోసారి దూకుడుగా వ్యవహరిస్తే తమ ఏరోస్పేస్ దళాలు ఎలాంటి పరిమితులు లేకుండా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని IRGC స్పష్టం చేసింది.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర దేశాలకూ ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా చేపట్టే సైనిక చర్యలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించే దేశాలను కూడా తమపై దాడిలో భాగస్వాములుగా పరిగణిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదిక Xలో ఒక సందేశం పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఒక కొరియన్ సామెతను కూడా ప్రస్తావించారు. “కొంగ వెనుక ఎగరాలని ప్రయత్నించే పిచ్చుక చివరకు తన కాళ్లను విరగ్గొట్టుకుంటుంది” అనే అర్థం వచ్చే సామెతను ఉటంకించారు. అమెరికాతో కలిసి ఇరాన్‌కు వ్యతిరేకంగా నిలిచే దేశాలు చివరకు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ వ్యాఖ్యల ద్వారా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఇరాన్ తాజా ప్రకటనలతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, హార్ముజ్ జలసంధి ప్రాంతం అంతర్జాతీయంగా కీలకంగా మారాయి. ప్రపంచ చమురు రవాణాలో హార్ముజ్ జలసంధికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ చమురు సరఫరా, ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే బహ్రెయిన్‌లో అమెరికా రాడార్ ధ్వంసమైందన్న ఇరాన్ ప్రకటన, ఇతర దేశాలకు చేసిన హెచ్చరికలపై అమెరికా అధికారిక స్పందన ఏమిటన్నది కీలకంగా మారింది. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.

