Iran: గతేడాది ఇరాన్ దేశాన్ని మహ్స అమిని అనే యువతి మరణం ఓ కుదుపుకుదిపేసింది. మత సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హిజాబ్ సరిగా ధరించలేదని కుర్దిష్ యువతి అయిన మహ్సా అమినిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేసి కొట్టడంతో ఆమె మరణించింది. ఈ మరణం ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ ఉద్యమానికి కారణమైంది. మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అక్కడి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరిగాయి.
ఇదిలా ఉంటే మహ్సా అమిని మరణ వార్తల్ని కవర్ చేసినందుకు ఇరాన్ లోని ఒక న్యాయస్థానం ఇద్దరు మహిళా జర్నలిస్టుకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై 20 రోజుల్లో అప్పీల్ కి వెళ్లవచ్చు. అమిని హిజాబ్ వదులగా ధరించినందుకు చనిపోయారని జర్నలిస్టు నిలౌఫర్ హమేదీ, ఆమె అంత్యక్రియల గురించి రాసిన ఇలాహెహ్ మొహమ్మదీకి వరసగా ఏడు, ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు న్యాయవార్తా వెబ్సైట్ మిజాన్ నివేదించింది.
Read Also: Azam Khan: “మేము ఎన్‌కౌంటర్ కావొచ్చేమో”.. యూపీ నేత ఆజం ఖాన్ కీలక వ్యాఖ్యలు..
అమెరికాకు సహకరించడం, జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కుమ్మక్కవ్వడం, వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఇద్దరు జర్నలిస్టులపై అభియోగాలు మోపబడ్డాయి. వారిద్దరిని సెప్టెంబర్ 2022లో అదుపులోకి తీసుకున్నారు. మే నెలలో ఐక్యరాజ్యసమితి ఇద్దరు జర్నలిస్టులకు వారి జవాబుదారీతనం, నిజాయితీలకు బహుమతి ప్రదానం చేసింది.
మహ్సా అమిని మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. లక్షల మంది రోడ్లపైకి వచ్చి హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ మహిళలు నిరసన తెలిపారు. ఈ ఆందోళనల్లో ప్రభుత్వ అధికారులు కూడా మరణించారు. ప్రభుత్వం ఈ నిరసనలను అణిచివేసిన తర్వాత ఇందులో పాల్గొన్న కొంతమందిని ఉరితీసి చంపింది. మరికొంత మందిని జైళ్లలో ఉంచింది. దాదాపు 100 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేసింది. ఈ ఉద్యమం వల్ల 529 మంది మరణించారు. 19,700 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.