Site icon NTV Telugu

Iran: ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్‌లో పర్యటించనున్న ఇరాన్ అధ్యక్షుడు..

Ibrahim Raisy

Ibrahim Raisy

Iran: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య తీవ్ర పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఏప్రిల్ 22న పాకిస్తాన్‌లో పర్యటించనున్నారు. పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో రైసీ భేటీ కానున్నారు. ఏప్రిల్ 1న సిరియా డమాస్కస్‌ లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కి చెందిన ఇద్దరు సైనిక జనరల్స్‌తో పాటు ఏడుగురు సైనికాధికారులు మరణించారు. ఆ తర్వాత ఇరాన్ ప్రతీకారంగా నిన్న ఇజ్రాయిల్ పైకి వందలాది డ్రోన్లతో, క్షిపణులతో దాడి చేసింది. ఈ పరిణామాల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు పాకిస్తాన్‌లో పర్యటనకు వెళ్తుండటం గమనార్హం.

Read Also: Oman Floods: ఒమన్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 13 మంది మృతి, పలువురు గల్లంతు

ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్, ఇరాన్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఇరాన్ సైనికులు, అధికారులపై దాడులకు పాల్పడుతున్న ‘జైష్ అల్ అద్ల్’ టార్గెట్‌గా పాకిస్తాన్‌పై దాడులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఇరాన్‌పై ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. అయితే ఆ తర్వాత ఇవన్నీ సద్దుమణిగాయి.

తాజాగా రైసీ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సబంధాలు, భద్రతా సహకారం, గ్యాస్ పైప్ లైన్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్-ఇరాన్ గ్యాస్ పైప్ లైన్ చర్చ ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయిల్ నౌకలో ఉన్న పాకిస్తానీలను వారి జాతీయత ధృవీకరించిన తర్వాత, చట్టపరమైన లాంఛనాలు పూర్తైన తర్వాత విడుదల చేస్తామని సోమవారం ఇరాన్ ప్రకటించింది.

Exit mobile version