NTV Telugu Site icon

Iran Presidential Elections: ఇరాన్‌లో రెండో దఫా అధ్యక్ష ఎన్నికలు.. అభ్యర్థులు వీరే..

Iran Elections

Iran Elections

Iran Presidential Elections: ఇరాన్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందడంతో శుక్రవారం ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అతివాద నేత సయీద్ జలీలీ, సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ మధ్య నెలకొంది. అంతకుముందు జూన్ 28న జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో ఏ అభ్యర్థికీ 50 శాతానికి మించి ఓట్లు రాలేదు. ఏ అభ్యర్థికీ 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు రాకపోవడంతో ఇరాన్‌లో మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. జైలు శిక్ష పడిన నోబెల్ గ్రహీత నర్గీస్ మహమ్మదీ సహా పలువురు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

Read Also: Noida Fire : నోయిడా మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన జనం

మే 19న హెలికాప్టర్‌ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యం కాగా.. సుప్రీం లీడర్‌ అయాతొల్లా అలీ ఖమేనీ ఆజ్ఞలను పాటిస్తూ దేశాధ్యక్షునిగా పాలించేందుకు ముగ్గురు అతివాద నేతలు, ఒక సంస్కరణవాది ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చారు. తొలి రౌండ్‌లో సంస్కరణవాది డాక్టర్‌ మసూద్‌ పెజెష్కియన్‌ అందరికంటే ఎక్కువగా 42.5 శాతం ఓట్లు సాధించారు. అతివాది సయీద్‌ జలీలీ 38.6 శాతం ఓట్లు సాధించారు. దేశంలో 6 కోట్ల మంది ఓటర్లుంటే కేవలం 2.5 కోట్ల మంది ఓటేశారు. దేశ చరిత్రలోనే అత్యల్పంగా 40 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎవరికీ 50 శాతం ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండోదశ పోలింగ్‌కు అర్హత సాధించారు. ఈ క్రమంలో మసౌద్ పెజెష్కియాన్, సయూద్ జలీలీలమాత్రమే ఈరోజు జరిగే ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియను నిర్వహించే బాధ్యత ఆ దేశ హోంమంత్రి అహ్మద్ వహీద్‌పై ఉంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభం కాగా.. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు.

ఓటేసిన అయతుల్లా అలీ ఖమేనీ
దేశ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ తన నివాసంలో ఓటు వేశారు. “ప్రజలు మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారని నేను తెలుసుకున్నాను. ప్రజలు ఓటు వేసి ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవాలి.” అయితే, గత వారం ఓటు వేయని వారు దేశంలోని షియా మతతత్వానికి వ్యతిరేకం కాదని అయతుల్లా అలీ ఖమేనీ బుధవారం అన్నారు. ఇదిలా ఉండగా.. జలీలీ గెలిస్తే ఇరాన్‌లో తాలిబాన్ లాంటి ప్రభుత్వాన్ని తెస్తారని పెజెష్కియాన్ మద్దతుదారులు హెచ్చరిస్తున్నారు. పెజెష్కియాన్ భయాన్ని వ్యాప్తి చేస్తున్నాడని జలీలీ ఆరోపించారు.