Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..

  • పర్వత సొరంగాల్లో ఇరాన్ అణు పదార్థం.
  • ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ నివేదిక..
Iran War

Iran War

Israel-Iran: ఇరాన్ అణు కార్యక్రమాల గురించి ఇజ్రాయిల్ సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. నటాంజ్ సమీపంలోని పికాక్స్ పర్వతం( మౌంట్ కోలాంగ్) వద్ద ఉన్న లోతైన సొరంగాల్లో యురేనియాన్ని ఎన్‌రిచ్ చేసే వేలాది సెంట్రిఫ్యూజ్‌లను తరలించినట్లు ఇజ్రాయిల్ నిఘా సంస్థలు భావిస్తున్నాయి. జూన్ 2025 యుద్ధంలో ఇరాన్ మూడు అణు కేంద్రాలు దెబ్బతిన్న తర్వాత వీటిని తరలించినట్లు తెలుస్తోంది. పర్వతం కింద వందల అడుగుల లోతులో నిర్మించిన ఈ కేంద్రాన్ని వైమానిక దాడుల్ని తట్టుకునేలా రూపొందించారని నివేదిక చెప్పింది.

పికాక్స్ పర్వత సముదాయం 300 నుండి 450 అడుగుల రాతి పొర కింద ఉంది. ఈ లోతు కారణంగా, సంప్రదాయ వైమానిక దాడులతో దీనిని నాశనం చేయడం అత్యంత సవాలుతో కూడుకున్నది. ఇజ్రాయెల్ నిఘా నివేదికల ప్రకారం, గత 15 నెలలుగా అక్కడ ట్రక్కుల రాకపోకలు, సొరంగాల పటిష్టత పనులు జరిగాయి. ఇరాన్ ఈ ప్రదేశానికి IAEA (అంతర్జాతీయ అణుశక్తి సంస్థ)కు కూడా ప్రవేశాన్ని కల్పించలేదు. దీని గురించి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఇరాన్ వద్ద సుమారుగా 454 కిలోల 60 శాతం ఎన్‌రిచ్ చేసిన యురేనియం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇది ఆయుధ తయారీకి అనువైన స్థాయి.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. పికాక్స్ పర్వతంపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల ఈ ప్రాంతంలో చాలా తక్కువ కార్యకలాపాలు కనిపించాయి. ఈ దాడులు ఇరాన్‌లో అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా ఆపడంలో విఫలమైందని ఇజ్రాయిల్ సైనికాధికారులు భావిస్తున్నారు. పికాక్స్ పర్వతం సహా చాలా చోట్ల ఇంకా దాడులు చేయాల్సిన అవసరం ఉందని విశ్వసిస్తున్నారు.