Site icon NTV Telugu

Iran: ఇజ్రాయిల్ నౌకను సీజ్ చేసిన ఇరాన్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత..

Iran

Iran

Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య తీవ్ర టెన్షన్ తలెత్తింది. ఇజ్రాయిల్‌పై ఇరాన్ 24 గంటల్లో ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి టాప్ ఇరాన్ మిలిటరీ కమాండర్‌తో పాటు ఆరుగురు కీలక సైనికాధికారులను హతమార్చింది. అయితే, ఈ దాడికి ఇజ్రాయిల్ బాధ్యత ప్రకటించుకోలేదు. ఈ దాడి తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత, ఆ ప్రాంతంలోని ఇతర దేశాలను కూడా రిస్క్‌లో పడేశాయి.

Read Also: Raj Thackeray: ప్రధాని మోడీ లేకుంటే “రామమందిరం” నిర్మితమయ్యేదే కాదు..

ఇదిలా ఉంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం ఇజ్రాయిల్‌కి సంబంధించిన ఓ నౌకను స్వాధీనం చేసుకున్నాయి. ‘‘గల్ఫ్‌లోని జియోనిస్ట్ పాలనకు (ఇజ్రాయెల్) సంబంధించిన” కంటైనర్ షిప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు’’ ఇరాన్ స్టేట్ మీడియా నివేదించింది. MCS ఏరీస్ అనే కంటైనర్ షిప్‌ను సెపా (గార్డ్స్) నేవీ స్పెషల్ ఫోర్సెస్ హెలిబోర్న్ ఆపరేషన్ చేయడం ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఆపరేష్ హార్ముజ్ జలసంధి సమీపంలో జరిగిందని, ఇప్పుడు ఆ ఓడ ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు మళ్లించబడిందని తెలిపింది.

ఇప్పటికే రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధం మొదలవుతుందో అని మధ్యప్రాచ్యంతో పాటు ప్రపంచం మొత్తం బయపడుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ నౌకను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఎలాంటి దాడిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. దక్షిణ గాజాలో ఉన్న ఇజ్రాయిల్ బలగాలను వెనక్కి రప్పించడమే కాకుండా ఇరాన్ దాడిని తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది ఇజ్రాయిల్. మరోవైపు అమెరికా ఇజ్రాయిల్‌కి సహాయం కోసం యుద్ధనౌకల్ని పంపించింది.

Exit mobile version