ఉక్రెయిన్ – రష్యా యుద్ధ పరిణామాలు భారత్ నే కాదు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల ఇప్పటికే భారత్ లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదిలా ఉంటే మిడిల్ ఈస్ట్ కంట్రీ ఇరాన్ కు కూడా ఉక్రెయిన్ సెగ తగిలింది. ఆ దేశంలో పలు నిత్యావసరాల ధరలు 300 శాతం పెరిగాయి. ఇరాన్ ప్రభుత్వం గురువారం నాడు చికెన్, పాలు, గుడ్ల వంటి ప్రధాన నిత్యావసరాల ధరలను 300 శాతం పెంచింది.
దీంతో ధరల పెరుదల కారణంగా ఇరాన్ ప్రజలు సూపర్ మార్కెట్ల వద్ద క్యూ కట్టారు. ధరల పెరుగుదల అమలులోకి వచ్చే ముందే సరుకులు కొనుగోలు చేయాలని సూపర్ మార్కెట్ల ముందు పెద్ద పెద్ద క్యూల్లో నిలుచున్నారు. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే సూపర్ మార్కెట్లలోని సరుకులు పూర్తిగా అయిపోయాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ధరల పెరుగుదలకు ప్రతిగా ప్రతీ ఇరానియన్ కు 14 డాలర్లు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, కరువు పరిస్థితులు అన్నీ కలిసి ఇరాన్ లో ద్రవ్యోల్భనం 40 శాతానికి చేరింది. 1994 తర్వాత ఇదే గరిష్టం. మరోవైపు యుద్ధం కారణంగా సప్లై చైన్ దెబ్బతింది. దీంతో మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాల్లో విపరీతంగా ధరలు పెరిగాయి. ఇరాన్ తన వంటనూనెలను ఉక్రెయిన్ నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుత యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు తీవ్రంగా పెరిగాయి. ఇరాన్ లోని ప్రజల కొనుగోలు శక్తి వేగంగా తగ్గిపోతోంది. మరోవైపు అణు కార్యక్రమాలు నిర్వహిస్తుందనే కారణంగా పాశ్చాత్య దేశాలు ఇరాన్ పై అనేక ఆంక్షలు పెట్టారు. ఈ ఆంక్షలు కూడా ఇరాన్ పై భారాన్ని పెంచుతున్నాయి.