Site icon NTV Telugu

Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..

Iran Closes Strait Of Hormuz

Iran Closes Strait Of Hormuz

Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభాన్ని స‌ృష్టించింది. సుప్రీంలీడర్ ఖమేనీ అంతమే లక్ష్యంగా ఇజ్రాయిల్-అమెరికా సంయుక్త దాడుల్ని శనివారం ప్రారంభించాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ లోని అమెరికా మిత్రదేశాలను టార్గెట్ చేసింది. కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్ వంటి దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అబుదాబి, దుబాయ్, రియాద్ వంటి నగరాలపై డ్రోన్, మిస్సైల్ దాడులు నిర్వహించింది. ఇదిలా ఉంటే, తాజాగా ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హర్మూజ్ జలసంధి’’ని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హార్ముజ్ జలసంధి గుండా ఎటువంటి నౌకకు అనుమతి లేదని ఇరాన్ గార్డులు నౌకలకు చెబుతున్నారని EU నావికా దళం పేర్కొంది.

ప్రపంచంలోని రోజువారీ చమురు వినియోగంలో 20 శాతం ఈ హార్మూజ్ జలసంధి నుంచే ప్రయాణిస్తుంటుంది. ఈ జలసంధిని మూసేయడం ద్వారా తమ ప్రపంచంపై ఇరాన్ ఒత్తిడి పెడుతోంది. పాశ్చాత్య దేశాల ఒత్తిడికి ప్రతీకారంగా హార్మూజ్ జలసంధిని మూసేస్తామని గతంలో కూడా ఇరాన్ బెదిరించింది.

అసలేంటి ఈ జలసంధి:

అరేబియా సముద్రాన్ని, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ఇరుకైన మార్గాన్ని ‘‘హార్మూజ్ జలసంధి’’గా పిలుస్తారు. సన్నటి ఈ సముద్రమార్గం గుండా కువైట్, బహ్రైన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా , ఇరాన్ చమురు ఎగుమతులు కొనసాగుతాయి. ఈ ప్రాంతంలోని ద్వీపాలు ఎక్కువగా ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. వీటిలో ఇరాన్ మిలిటరీ ఉనికి ఉంది. పరిస్థితులు చేజారిపోతే, ఈ జలసంధిని ఇరాన్ మూసేసింది. 33 కి.మీ వెడల్పు ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ముఖ్యంగా, ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన ఇండియా, చైనాకు ఇది ప్రమాదం.

ఈ మార్గం గుండా వచ్చే చమురు ఎగుమతుల్లో 82 శాతం ఆసియాకు వెళ్తున్నాయి. ఇందులో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వాటా ఏకంగా 67 శాతం ఉంది. భారత్ ముడి చమురులో 90 శాతం చమురును మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40 శాతం హార్మూజ్ జలసంధి నుంచే వస్తున్నాయి. ఒక వేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఫలితంగా చమురు ధరలు చుక్కల్ని అంటుతాయి.

Exit mobile version