NTV Telugu Site icon

American Military: ఎర్ర సముద్రంలో యూఎస్ నేవీ వర్సెస్ హౌతీ రెబల్స్.. నౌకల్ని ముంచేసిన నేవీ..

Red Sea

Red Sea

American Military: ఎర్ర సముద్రం రణరంగంగా మారుతోంది. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ సముద్రం గుండా వచ్చే వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు అమెరికా మిలిటరీ ఆ ప్రాంతంలో మోహరించింది. రెడ్ సీలో కంటైనర్ షిప్‌లపై దాడులు చేస్తున్న ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగబాటుదారులు నిర్వహిస్తున్న మూడు నౌకల్ని ముంచేసినట్లు యూఎస్ నేవీ తెలిపింది. యూఎస్ నేవీ హెలికాప్టర్లు వీటిపై దాడి చేసినట్లు ఆదివారం వెల్లడించింది.

ముందుగా యూఎస్ హెలికాప్టర్లపై హౌతీలు కాల్పులు జరిపిన తర్వాత, ఆత్మరక్షణ కోసం యూఎస్ నేవీ తిరిగి కాల్పులు జరిపిందని, నౌకకు 20 మీటర్ల దూరంలో ఉన్న నాలుగు చిన్న బోట్లలో మూడింటిని సముద్రంలో ముంచి, అందులో ఉన్న వారిని చంపేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగో పడవ అక్కడ నుంచి పారిపోయిందని వెల్లడించింది.

Read Also: Boeing 737 MAX: బోయింగ్ 737 మాక్స్ విమాన రడ్డర్‌లో సమస్యలు.. అప్రమత్తమైన విమానయాన సంస్థలు..

సింగపూర్ జెండాతో ఉన్న, డెన్మార్క్ దేశానికి చెందిన కంటైనర్ షిప్ మార్స్క్ హాంగ్‌జౌ దాడికి గురవుతున్నట్లు తెలిసి, సహాయం కోసం అభ్యర్థించడంతో యూఎస్ నేవీ స్పందించింది. రెడ్ సీ నుంచి ప్రయాణిస్తున్న నౌకలపై 24 గంటల్లో ఇది రెండో దాడి. హౌతీ నియంత్రణలో ఉన్న యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి మార్స్క్ హాంగ్‌జౌను తాకింది.

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో హమాస్‌కి మద్దతుగా యెమెన్‌లోని హౌతీ రెబల్స్ ఇజ్రాయిల్‌కి సంబంధం ఉన్న నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో పాటు రెడ్ సీ నుంచి వచ్చీపోయే నౌకలపై డ్రోన్ అటాక్స్ జరుపుతున్నారు. ఈ దాడుల వల్ల ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం నౌకారవాణపై ప్రభావం పడుతోంది. ఈ దాడులకు ఇరాన్ మద్దతు ఉందని అమెరికా ఆరోపిస్తోంది.