Iran Israel: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం రాబోతోందా..? అనే చర్చ నడుస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాని ఇజ్రాయిల్ దారుణంగా దెబ్బతీసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాతో పాటు దాని ప్రధాన కమాండర్లను దాడుల్లో హతమార్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇరాన్, ఇజ్రాయిల్‌పైకి ఏకంగా 180 బాలిస్టిక్ మిస్సైళ్లని ప్రయోగించింది. ఈ దాడిని ఇజ్రాయిల్ క్షిపణి నిరోధక వ్యవస్థ అడ్డుకుంది. అయితే, ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ హెచ్చరించింది.
ఇరు దేశాల సైనిక బలాలు: (ది మిలిటరీ బ్యాలెన్స్ 2023 ప్రకారం..)
ఇరాన్ సైన్యం:
ఇరాన్ సైన్యంలో 3,50,000 మంది, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ఫ్స్‌లో 1,90,000 మంది, నౌకా దళంలో 18,000 మంది, వైమానిక దళంలో 37,000 మంది, వైమానిక రక్షణలో 15,000 మందితో సహా 6,10,000 మంది యాక్టివ్ సిబ్బంది ఉంది. ఇరాన్‌కి అదనంగా 3,50,000 రిజర్వ్ సైన్యం ఉంది.
ఇజ్రాయిల్ సైన్యం:
ఇజ్రాయెల్‌లో 169,500 మంది యాక్టివ్ సిబ్బందిని కలిగి ఉంది. సైన్యంలో 1,26,000 మంది, నేవీలో 9,500 మంది, వైమానిక దళంలో 34,000 మంది ఉన్నారు. ఇజ్రాయిల్‌కి బలమైన రిజర్వ్ సైన్యం 4,65,000 మంది ఉన్నారు. ఇజ్రాయిల్ కొన్ని మినహాయింపులతో 18 ఏళ్లకు పైబడిన చాలా మంది యువకులు, మహిళల్ని సైన్యంలో పనిచేయడం తప్పనిసరి చేస్తుంది.
సైనిక వ్యయం:
ఏప్రిల్ 2024లో స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ప్రచురించిన ఫాక్ట్ షీట్ ప్రకారం..
ఇరాన్ 2023లో తన మిలిటరీపై 10.3 బిలియన్ డార్లను ఖర్చు చేసింది. 2022 నుంచి 0.6 శాతం పెంచింది.
ఇజ్రాయిల్ 2023లో తన మిలిటరీపై ఏకంగా 27.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. 2022 నుంచి 24 శాతం పెరిగింది.
గ్రౌండ్ ఫోర్సెస్:
ఇరాన్‌లో 10,513 యుద్ధ ట్యాంకులు, 6,798 కంటే ఎక్కువ ఫిరంగి తుపాకులు మరియు 640 కంటే ఎక్కువ ఆర్మ్డ్ పర్సనల్ కారియర్స్ ఉన్నాయి. సైన్యం వద్ద 50 హెలికాప్టర్లు ఉన్నాయి.
ఇజ్రాయిల్ వద్ద దాదాపుగా 400 యుద్ధ ట్యాంకులు, 530 ఆర్టిలరీ గన్స్, 1190 ఆర్మ్డ్ పర్సనల్ కారియర్స్ ఉన్నాయి.
వైమానిక బలాలు:
ఇరాన్ వద్ద 312 యుద్ధ విమానాలు, ఇరాన్ రివల్యూషరీ గార్డ్స్ వద్ద 23 ఉన్నాయి. రెండుఅటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. రష్యా తయారీ పాత సుఖోయ్, మిగ్ ఫైటర్ జెట్లు ఉన్నాయి.
ఇజ్రాయిల్ వద్ద 345 యుద్ధ విమానాలు, 43 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. అమెరికా తయారీ అధునాతన ఎఫ్-35 జెట్లు ఉన్నాయి.
నౌకా దళం:
ఇరాన్ వద్ద 17 వ్యూహాత్మక జలాంతర్గాములు, 68 గస్తీ మరియు కోస్టల్ కాంబాటెంట్స్ ఉన్నాయి. ఏడు కోర్వెట్స్, 12 ల్యాండింగ్ షిప్స్, 11 ల్యాండింగ్ క్రాఫ్ట్, 18 లాజిస్టిక్స్ అండ్ సపోర్ట్ ఎక్వీప్మెంట్ ఉన్నాయి.
ఇజ్రాయిల్ వద్ద 07 సబ్ మెరైన్స్, 49 పెట్రోలింగ్ మరియు కోస్టల్ కాంబెటంట్స్ ఉన్నాయి.
బాలిస్టిక్ మిస్సైల్స్:
ఇరాన్ వద్ద 12 రకాల మీడియం రేంజ్, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి. వీటిలో 150 కి.మీ పరిధితో పాటు 2000 కి.మీ పరిధిని కవర్ చేసే క్షిపణులు ఉన్నాయి.
ఇజ్రాయిల్ వద్ద నాలుగు రకాల మిస్సైల్స్ ఉన్నాయి. ఇవి మీడియం, షార్ట్, లాంగ్ బాలిస్టిక్ క్షిపనలు ఉన్నాయి. ఇవి 280 కి.మీ నుంచి 4800 కి.మీ, 6500 కి.మీ పరిధిని కలిగి ఉన్నాయి.
క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థ:
ఇరాన్: బవర్-375, ఎస్-300, ఖోర్దాద్ సిస్టమ్ కలిగి ఉంది.
ఇజ్రాయిల్: ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, ఆరో సిస్టమ్ కలిగి ఉంది.
న్యూక్లియర్ శక్తి:
ఇజ్రాయిల్ దాదాపుగా 90 వరకు అణు వార్ హెడ్‌లను కలిగి ఉంది. ఇరాన్ వద్ద ప్రస్తుతానికి అణ్వాస్త్రాలు లేవని నమ్ముతున్నారు. అయితే, అది దాని అణుశక్తిని వేగంగా అభివృద్ధి చేసుకుంటోంది.