Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి

  • ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ
  • నలుగురు మృతి.. పలువురికి గాయాలు
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం
Indonesia

Indonesia

ఇండోనేషియాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జకార్తా సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు చనిపోగా.. పదుల కొద్ది గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సహాయ బృందం సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బెకాసి తిమూర్ రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్ రైలు ఆగి ఉంది. అదే ట్రాక్‌పైకి మరొక రైలు వచ్చేసింది. దీంతో బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. కొందరు భయంతో కేకలు వేస్తూ కిందకు దూకేశారు. వెనుక నుంచి బలంగా రైలు ఢీకొట్టడంతో చాలా బోగీలు ధ్వంసమయ్యాయి. ఇక రంగంలోకి దిగిన సహాయ బృందాలు.. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం నలుగురు మృతదేహాలను బయటకు తీయగా.. డజన్ల కొద్దీ గాయపడడంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, సరైన నిర్వాహణ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రైలు భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇండోనేషియాలో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2024 జనవరిలో వెస్ట్ జావాలో జరిగిన ప్రమాదంలో నలుగురు సిబ్బంది మృతి చెందగా.. దాదాపు 24 మంది గాయపడ్డారు. అలాగే 2015లో జకార్తాలో రైలు-మినీబస్ ఢీకొన్న ఘటనలో 16 మంది మరణించారు.