India – Pakistan: భారత్ – పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!

  • భారత్ - పాకిస్తాన్ మధ్య ఖైదీల జాబితా మార్పిడి..
  • 188 మంది భారతీయుల రిహాబిలిటేషన్‌కు డిమాండ్
India Pakistan

India Pakistan

India – Pakistan: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు – దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నప్పటికీ, భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య బుధవారం ఒక కీలకమైన మానవీయ చొరవ చోటుచేసుకుంది. 2008 కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1, జూలై 1 తేదీల్లో ఖైదీల వివరాలను పంచుకునే సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారా తమ అదుపులో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను పరస్పరం మార్చుకున్నాయి.

ఏ దేశంలో ఎంతమంది ఖైదీలంటే..

భారతదేశం తన ఆధీనంలో ఉన్న 386 మంది పాకిస్థానీ పౌర ఖైదీలు, 53 మంది మత్స్యకారుల జాబితాను పాక్‌కు అప్పగించింది. మరోవైపు పాకిస్థాన్ తన జైళ్లలో ఉన్న 52 మంది భారతీయ పౌర ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్‌తో పంచుకుంది. పాకిస్థాన్ జైళ్లలో ఇప్పటికే శిక్షాకాలం పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా విముక్తి లభించని 188 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి తమ స్వదేశానికి పంపించాలని భారతదేశం గట్టిగా డిమాండ్ చేసింది. అలాగే భారతీయులుగా భావిస్తున్న మరో 13 మంది పౌర ఖైదీలకు ఇంకా దౌత్యపరమైన సేవలు (కాన్సులర్ యాక్సెస్) అందలేదని, వారికి తక్షణమే ఆ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేసింది. ఖైదీలు విడుదలయ్యేంత వరకు వారి భద్రత, సంరక్షణ, శ్రేయస్సుకు పాక్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరింది. దీంతో పాటు గల్లంతైన భారత రక్షణ సిబ్బందిని కూడా త్వరగా అప్పగించాలని భారత్ పునరుద్ఘాటించింది.

2014 నుంచి 2,700 పైగా భారతీయుల పునరాగమనం

కేంద్ర ప్రభుత్వ నిరంతర దౌత్య ప్రయత్నాల కారణంగా 2014 నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్ నుంచి 2,661 మంది భారతీయ మత్స్యకారులు, 78 మంది పౌర ఖైదీలు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇందులో 2023 తర్వాత విడుదలైన 500 మంది మత్స్యకారులు, 20 మంది పౌర ఖైదీలు కూడా ఉన్నారు. పహల్గామ్ దాడి అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి, నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అనేక రెచ్చగొట్టే ప్రకటనలు జారీ చేస్తూ ఉద్రిక్తతలను పెంచుతోంది. ఉగ్రవాదం, సరిహద్దు రక్షణ విషయంలో భారత్ ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, ఖైదీల విషయంలో మానవీయ కోణాన్ని ప్రదర్శిస్తూ ఈ ప్రక్రియను పూర్తి చేయడం విశేషం అని విశ్లేషకులు చెబుతున్నారు.