India-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పరిస్థితి తీవ్రతను మరింత పెంచారు. భారత్ తమపై దాడికి సిద్ధమవుతుందని సాక్ష్యాత్తు ఆ దేశ మంత్రులే వ్యాఖ్యానించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యం భారత సరిహద్దుల్లో మోహరించింది. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పై భారత్ దాడి చేస్తుందేమో అని పాక్ తెగ భయపడుతోంది. ఈ మేరకు ఇప్పటికే పీఓకేలోని మదర్సాలను, మతపరమైన కార్యకలాపాలను ఖాళీ చేయించింది.
Read Also: Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? కారణాలు ఇవేకావొచ్చు.. జాగ్రత్త సుమీ!
ఇదిలా ఉంటే, తాజాగా జమ్మూ కాశ్మీర్ ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. అఖిలపక్ష సమావేశం తర్వాత నియంత్రణ రేఖ (LOC) సమీపంలో నివసిస్తున్న నివాసితులు ఆహారం, అవసరమైన వస్తువులను నిల్వ చేసుకోవాలని కోరారు. నీలం లోయ, ఎల్ఓసీ పక్కనే ఉన్న ప్రాంతాల్లోకి పర్యాటకులను నిలిపేశారు.
సైనిక సంఘర్షణ జరిగితే సహాయక చర్యలకు మద్దతుగా రూ. 1 బిలియన్ విలువైన అత్యవసర ప్రతిస్పందన నిధిని ఏర్పాటు చేశారు. అదనంగా, నీలం, జీలం, పూంచ్, హవేలి, కోట్లి, భీంబర్‌తో సహా కీలకమైన ఎల్‌ఓసి నియోజకవర్గాలలో రోడ్లు తెరిచి ఉండేలా చూసుకోవడానికి అధికారిక, ప్రైవేట్ యంత్రాగాన్ని మోహరించారు. పీఓకేలోని పౌర రక్షణ దళాలను హై అలర్ట్‌లో ఉంచారు. స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ప్రజలకు అత్యవసర రెస్క్యూ హెల్ప్ లైన్ నంబర్ 1122ని జారీ చేశారు. పీఓకే అధికారులు ఎల్ఓసీ వెంబడి సరిహద్దుల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్రమోడీ సహా భారత నేతల ప్రకటన మధ్య కరాచీ,లాహోర్‌లోని ప్రధాన విమానాశ్రయాల ఎయిర్‌స్పేస్ ప్రతీ రోజు 8 గంటలు మూసేస్తున్నారు.
