Turkey: శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెతను భారతదేశం పాటిస్తోంది. అన్ని వేళల్లో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు ఇదే సూత్రాన్ని వర్తింపచేస్తోంది. ఇప్పటికే, అజర్ బైజాన్‌కు వ్యతిరేకంగా ఆర్మేనియాకు పెద్ద ఎత్తున భారత్ ఆయుధాలను అందిస్తోంది. మరోవైపు, టర్కీకి కూడా చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. టర్కీకి అతిపెద్ద శత్రువుగా ఉన్న సైప్రస్ దేశంలో భారత్ తన రక్షణ సంబంధాలను పెంచుకుంటోంది.
ఇటీవల, కెనడాలో జరిగిన జీ-7 దేశాల సమ్మిట్‌కు వెళ్లే క్రమంలో మోడీ సైప్రస్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు ఈ ఒప్పందాలు అమలులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. సైప్రస్ రిపబ్లిక్ యొక్క పరిశోధన మరియు ఆవిష్కరణ (CSRI) ప్రధాన శాస్త్రవేత్త డెమెట్రిస్ స్కౌరైడ్స్ బుధవారం మాట్లాడుతూ.. అనేక అవగాహన ఒప్పందాలు రూపుదిద్దుకోబోతున్నాయని అన్నారు.
Read Also: Saudi-Pak defence deal: సౌదీ-పాక్ ఒప్పందం, భారత భద్రతకు ముప్పు: కాంగ్రెస్..
ఇండియా సైప్రస్ సమ్మిట్ కోసం స్కోరైడ్ ముంబైలో ఉన్నారు. పరిశోధన, వాణిజ్యం, ఏఐ , రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి అవకాశాలను చర్చించడానికి మోడీ జూన్ నెలలో ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టౌరైడ్స్ తో సమావేశం అయ్యారని ఆయన చెప్పారు. రెండు దేశాలు రక్షణ ఒప్పందంపై పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు.
ఈ పరిణామాలు టర్కీకి మింగుడుపడటం లేవు. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న టర్కీకి, ఇప్పుడు సైప్రస్‌తో భారత్ చెక్ పెడుతోంది. టర్కీ, సైప్రస్ మధ్య 1974లో జరిగిన యుద్ధం రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని తీవ్రం చేసింది. 1974 వివాదం కారణంగా సైప్రస్ రెండుగా విభజించడానికి దారి తీసింది.