Site icon NTV Telugu

భారత్‌ – కాబూల్‌.. రోజుకు రెండు విమానాలు..

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.. దీంతో.. అక్కడ చిక్కుకున్న మనవాళ్ల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన నెలకొంది.. ఈ తరుణంలో.. ఆఫ్ఘన్‌ నుంచి భారత్‌కు ప్రతీ రోజు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి భారత్‌ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతిచ్చినట్టు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుతం కాబూల్‌లోని విమానాశ్రయంలో కార్యకలాపాలు అమెరికా నాటో బలగాల నియంత్రణలో ఉన్నాయి. నాటో దళాలు.. తమ ఆయుధాలు, పౌరులను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం రోజుకు మొత్తం 25 విమాన సర్వీసులను నడుపుతున్నాయి.

అందులో భాగంగా భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్‌) రవాణా విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి కొంతమంది ఆఫ్ఘన్ ప్రముఖులు, హిందూ, సిక్కు ప్రజాప్రతినిధులతో పాటు విమానంలో 85 మంది భారతీయులు ఇవాళ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే ఐఏఎఫ్‌ రెండు సీ-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్‌ ఇప్పటికే తరలించింది. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించింది. కాగా, ఆగస్టు 15న తాలిబన్లు ఆప్ఘాన్‌ రాజధాని కాబూల్‌ను సొంతం చేసుకున్నారు. ఎప్పుడైతే కాబూల్‌ తాలిబన్ల తుపాకీ నీడలోకి వెళ్లిందో.. ఆ మరుక్షణం నుంచే అక్కడి పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇండ్లు, కుటుంబాలు, సంపదించిన ఆస్తులను వదిలి పెట్టి కాబూల్‌లోని హమీద్‌ ఖర్జాయి ఎయిర్‌ పోర్టు దారి పట్టారు. వారం రోజులుగా ఎయిర్‌ పోర్టు చుట్టూ ఉన్న దారుల్లో ఇసకపోస్తే రాలలేనంత జనం గుమిగూడి ఉన్నారంటే అక్కడి పరిస్థిని అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version