Imran Khan “Sold” Gold Medal Received From India: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై పలు కేసులు నమోదు చేసింది షహజాబ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఇమ్రాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇమ్రాన్ ఖాన్ భారతదేశం నుంచి అందుకున్న బంగారు పతకాన్ని కూడా అమ్మేశారని ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న తోషాఖానా నుంచి రాయితీపై ప్రధాని పొందిన పలు వస్తువులను అడ్డదారుల్లో అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆసిఫ్ ఖాన్ అమ్ముకున్న బంగార పతకం గురించిన వివారాలను పెద్దగా వెల్లడించలేదు.
Read Also: IT Layoffs: అమెజాన్, మెటా బాటలో మరో టాప్ టెక్ దిగ్గజం.. 10 వేల ఉద్యోగాలు ఊస్ట్..
ఇమ్రాన్ ఖాన్ చర్యలు చట్టవిరుద్ధం కాదు.. కానీ ఆయన మాట్లాడే మాటలు చేతలకు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి అన్నారు. వివిధ దేశాల పర్యటన సమయంలో ప్రధానులకు వచ్చిన బహుమతులను పాకిస్తాన్ తోషాఖానాలో జమచేస్తుంటారు. ఇలా వచ్చిన వస్తువులను ఇమ్రాన్ ఖాన్ ఎక్కువ ధరకు అమ్ముకున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. తాను ప్రధానిగా ఉన్న సమయంలో నాలుగు బహుమతులను అమ్ముకున్నట్లు ఇమ్రాన్ ఖాన్ అంగీకరించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ పదవి కోసం పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని రక్షణ మంత్రి ఆసిఫ్ ఖాన్ విమర్శించారు. దేశంలోని సాయుధ బలగాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయని ప్రకటించినప్పటికీ.. ఇమ్రాన్ ఖాన్ వారిపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు.
అవిశ్వాసంతో ఈ ఏడాది ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయాడు. పీఎంగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు ఇమ్రాన్ ఖాన్. పాక్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ.. ఇండియా విదేశాంగ విధానం, ఇండియా సైన్యంపై పలుమార్లు ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఆజాదీ మార్చ్ పెద్ద ఎత్తున చేపట్టారు. అయితే ఈ మార్చ్ లో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల నుంచి ఇమ్రాన్ ఖాన్ తృటిలో తప్పించుకున్నారు.