పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు ఆయన ప్రభుత్వాన్ని దోపిడీ ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ను దొంగల చేతిలో పెట్టడం కన్నా అణుబాంబు వేయడం మంచిదంటూ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్-ఇ- ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
షహబాజ్ షరీఫ్, ఆయన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగలు అన్ని సంస్థలను, న్యాయ వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. ఏ అధికారి ఈ నేరస్తుల కేసులు విచారిస్తారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. మే 20న రాజధాని ఇస్లామాబాద్ లో 20 లక్షల మందితో లాంగ్ మార్చ్ చేస్తానని ప్రభుత్వానికి అల్టిమెటం జారీ చేశారు. మమ్మల్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నిజమైన స్వాతంత్ర్య పొందడానికి ప్రజలంతా పెద్ద ఎత్తున లాంగ్ మార్చ్ కు హాజరవుతారని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
ఇటీవల అనూహ్య పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. కొత్తగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ, గత ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కాపాడుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణం జరగకుండా అడ్డుకున్నారు. అయితే పాక్ సుప్రీం కోర్ట్ ఆదేశాలతో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసం ఎదుర్కొని గద్దె దిగాడు. అయితే అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ రగిలిపోతున్నారు. అమెరికా ప్రోద్భలంతోనే నేతలంతా అమ్ముడు పోయారని… తన ప్రభుత్వం పడిపోవడానికి విదేశీ శక్తులు కారణం అయ్యాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మరోవైపు పదవి కోల్పోతున్న సమయంలో భారత్ పై తెగ ప్రశంసలు కురిపించారు. భారత దేశంలో రాజకీయ వ్యవస్థలో ఆర్మీ కలుగచేసుకోదని… పాక్ ఆర్మీకి చురకలు అంటించారు. భారత్ ను ఏ సూపర్ పవర్ కూడా శాసించలేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత దేశం తమ ప్రజల ముఖ్యం అనుకుంటుందని ప్రశంసించారు.