Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..

  • ఇమ్రాన్ ఖాన్ మృతి..?
  • పాకిస్తాన్‌లో జోరుగా ప్రచారం..
  • ఆందోళనలో పీటీఐ, ఆయన అభిమానులు..
Imran Khan

Imran Khan

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారని పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రచారం మొదలైంది. అవినీతి ఆరోపణలపై రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న ఆయన కన్నుమూసినట్లు వార్తలు వెలువడ్డాయి. అమెరికాలో ఉంటున్న పాకిస్తానీ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పాక్ వ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ సైనికాధికారులు ఇమ్రాన్ ఖాన్ ఇక బతికి ఉండకపోవచ్చని భావిస్తు్న్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ముగ్గురు స్వయంగా చూసి నిర్ధారణకు రాలేదని స్పష్టం చేశారు.

కలిసేందుకు అనుమతించని అధికారులు:

కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, పార్టీ నేతలు, వ్యక్తిగత వైద్యులు జైలులో ఇమ్రాన్ ఖాన్‌కు కలిసేందుకు అధికారులు అనుమతించడం లేదు. ఇది కూడా అనుమానాలను పెంచుతోంది. జైలులో ఆయన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు మందగించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు స్వతంత్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని పీటీఐ డిమాండ్ చేస్తోంది.

ఇమ్రాన్‌ ఖాన్ కలిసేందుకు అనుమతించకపోతే భారీ స్థాయిలో ఆందోళన చేపడుతామని పీటీఐ హెచ్చరించింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన 20 లక్షల మంది ప్రజలు రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్ యువత ఆగ్రహంతో ఉందని, భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వస్తే వారిని నియంత్రించడం ఎవరి వల్లా కాదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే, పీటీఐ సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్‌కు మార్చ్‌ను ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే సుప్రీంకోర్టు, అడియాలా జైలు వద్ద నిరసన తెలుపుతామని ప్రకటించారు.

మునీర్‌తో విభేదాలే కారణం..

ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు 5 నుంచి జైలులో ఉన్నారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆయన భార్య బుష్రా బీబీకి ఇదే కేసులో 2025 జనవరిలో ఏడేళ్ల శిక్ష పడింది. ఇద్దరూ తమ శిక్షలను సవాలు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు విభేదాలే ఆయనను జైలుకు తీసుకువచ్చాయనే వాదన ఉంది. గతంలో తనను కాదని వేరే వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ ప్రాధాన్యం ఇవ్వడంతో మునీర్ కోపం పెంచుకున్నాడనే వాదన ఉంది. 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్, సైనిక వ్యవస్థపై బహిరంగంగా విమర్శలు మరింత పెంచారు. 2023 మే 9 ఘటనల తర్వాత పీటీఐపై సైన్యం, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నాయి.