NTV Telugu Site icon

Monsoon Brides: పాకిస్తాన్‌లో “రుతుపవన పెళ్లికూతుళ్లు”..

Monsoon Brides

Monsoon Brides

Monsoon Brides: భారత ఉపఖండంలోని దేశాలకు రుతుపవనాలే జీవనాధారం. రుతుపవనాలపై ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. అయితే, పాకిస్తాన్‌లో మాత్రం ‘‘రుతపవన పెళ్లికూతుళ్లు’’ పెరుగుతున్నారు. బాల్యంలోనే వారి తల్లిదండ్రులు వివాహాలు జరిపిస్తున్నారు. 2022లో పాకిస్తాన్ వ్యాప్తంగా, ముఖ్యంగా సింధ్ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ దేశం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో వ్యవసాయ భూములు నీటిలోనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. సింధ్‌ ప్రావిన్సులోని వ్యవసాయ ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో ఇప్పటికీ కోలుకోలేదు. అయితే, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోవడానికి చాలా కుటుంబాలు తన మైనర్ బాలికలకు వివాహం చేస్తున్నాయి. కుటుంబ మనుగడ కోసం డబ్బులు తీసుకుని పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. 2022 నుంచి దాదు జిల్లాలో ఈ ‘‘మాన్ సూన్ బ్రైడ్స్’’ అనే కొత్త ట్రెండ్ పెరిగినట్లు బాల్యవివాహాలను అరికట్టేందుక ప్రయత్నిస్తున్న సుజాన్ సన్సార్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవసాపకుడు మషూక్ బిర్మానీ చెప్పారు.

Read Also: Bulldozer action: ఉదయ్‌పూర్‌లో మత ఘర్షణలకు కారణమైన నిందితుడి ఇళ్లు కూల్చివేత..

కుటుంబాల మనుగడ కోసం ఏదైనా మార్గాన్ని కనుగొంటారు, దీంట్లో అత్యంత స్పష్టమైన మార్గం డబ్బుకు బదులుగా వారి కుమార్తెలకు వివాహం చేయడం అని ఆయన అన్నారు. ఖాన్ మొహ్మద్ ముల్లాహ్ గ్రామంలో జూన్‌లో ఉమ్మడి వేడుకల్లో షమీలా, అమీనా వివాహం జరిగింది. గత వర్షాకాలం నుంచి 45 మంది తక్కువ వయసు కలిగిన బాలికలు ఇప్పుడు భార్యలుగా మారారు. వారిలో 15 మందికి ఈ ఏడాది మే, జూన్‌లో వివాహాలు జరిగాయి. తమ కుమార్తెలను పేదరికం నుంచి కాపాడేందుకు డబ్బుకు బదులుగా వివాహాలు చేశామని తల్లిదండ్రులు చెబుతున్నారు.

షామిలా అనే బాలిక అత్తగారు మాట్లాడుతూ.. ఆమె తల్లిదండ్రులకు 20,000ల పాకిస్తానీ రూపాయాలు ఇచ్చామని చెప్పారు. నజ్మా అలీ అనే బాలికకు 2022లో 14 ఏట వివాహం చేశారు. ‘‘తన పెళ్లి కోసం నా భర్త తల్లిదండ్రులు 2,50,000 రూపాయలు ఇచ్చారు. అయితే, ఇదంతా అప్పుగా ఇచ్చారని, ప్రస్తుతం వారు ఇప్పుడు చెల్లించే మార్గం లేదు’’ అని ఆమె చెప్పింది. ప్రస్తుతం నజ్మా అలీ ఆరేళ్ల బిడ్డకు తల్లి. పాకిస్తాన్‌లో వివిధ ప్రావిన్సుల్లో బాలికల చట్టబద్ధమైన వివాహ వయసు 16-18గా ఉంది. అయితే, అంతకన్నా తక్కువ వయసులోనే బాలికలకు వివాహాలు జరగడం ఆ దేశంలో సాధారణమైంది. బాల్యవివాహాలు జరిగే టాప్ దేశాల్లో పాకిస్తాన్ ఆరో స్థానంలో ఉంది.