Hormuz Strait Crisis: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ సమయంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు హర్మూజ్ జలసంధి.. ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేసే హర్మూజ్ జలసంధి.. చాలా దేశాలు ఇంధన, గ్యాస్ కొరతకు కారణం అవుతుంది.. అయితే, హర్మూజ్ జలసంధిపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాంతంలో సరఫరాలకు అంతరాయం కలగడంతో చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా ఇరాన్‌పై ఆంక్షలను సడలించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇరాన్‌కు సంబంధించిన చమురు సరఫరాలు సముద్రంలో నిలిచిపోవడంతో, వాటిని విడుదల చేస్తే 3 నుంచి 4 రోజుల్లో ఆసియా దేశాల ఓడరేవులకు చేరవచ్చని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ తెలిపారు.
అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా 30 రోజుల పాటు ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను సడలించింది. దీని వల్ల సముద్రంలో నిలిచిపోయిన ట్యాంకర్లు తిరిగి ప్రయాణం ప్రారంభించి, సరఫరాలను వేగవంతం చేసే అవకాశం ఉంది. అంతకుముందు, స్కాట్ బెస్సెంట్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, సరఫరా అంతరాయాలను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ చమురు వాణిజ్యంలో కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ధరలు పెరిగాయి. ఈ పరిస్థితిని నియంత్రించడానికి సరఫరాలను పునరుద్ధరించడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అధిపతి ఫాతిహ్ బిరోల్ ప్రపంచం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశముందని హెచ్చరించారు. గల్ఫ్ దేశాల నుంచి సరఫరాలు పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి ఆరు నెలల వరకు పట్టవచ్చని తెలిపారు. అంతేకాకుండా, సరఫరా సమస్యలు కొనసాగితే చమురు ధరలు బ్యారెల్‌కు 180 డాలర్లకు పైగా పెరిగే అవకాశముందని గల్ఫ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. మొత్తానికి, హర్మూజ్ జలసంధి పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా మారుతున్నాయి. అమెరికా తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో చమురు ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
