NTV Telugu Site icon

Pakistan: తల్లిని పట్టుకుని ఏడ్చిన హిందూ బాలిక.. వెనక్కి తగ్గిన పాకిస్తాన్ కోర్టు..

Pakistan

Pakistan

Hindu girl forcibly converted to Islam sent to safe home by court after social media outrage: పాకిస్తాన్ దేశంలో ఇటీవల వరసగా హిందూ బాలికలు, మహిళలు కిడ్నాపుకు గురవుతున్నారు. సింధు ప్రావిన్సులో గత నెల ఇద్దరు బాలికలు కిడ్నాప్ కాగా.. పెళ్లయిన యువతిని కూడా ఇలాగే కిడ్నాప్ చేశారు. ఇటీవల కొన్ని వారం రోజుల క్రితం 14 ఏళ్ల బాలికను, ఈ వారంలో మరో ఇద్దరు బాలికను ఇలాగే కిడ్నాప్ చేశారు. వారందరిని కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుని మతం మార్చుతున్నారు. మైనారిటీలుగా ఉన్న హిందువులపై అక్కడి మెజారిటీ వర్గం తీవ్రంగా ప్రవర్తిస్తోంది. మైనారిటీలను పూర్తిగా తుడిచిపెట్టే ఉద్దేశ్యంతో హిందూ బాలికను బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుని ఇస్లాంలోకి మారుస్తున్నారు.

ఇదిలా ఉంటే సింధు ప్రావిన్స్ హైదరాబాద్ నగరంలో రెండు నెలల క్రితం పట్టపగలు బాలికను కిడ్నాప్ చేసి, ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే ఈ ఘటనపై అక్కడి అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా గురువారం కిడ్నాప్ అయిన బాలికను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు పంపించాలని ఆదేశించింది. కోర్టు మొదట్లో అమ్మాయిని తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. బాలిక భర్త తరుపు కోర్టుకు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించింది. దీన్ని కోర్టు అంగీకరించింది. అయితే కోర్టలో బాలిక తన తల్లిని పట్టుకుని ఏడుస్తూ కనిపించడం.. ఈ వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోర్టు వెనక్కి తగ్గింది. ఆమెను సురక్షితంగా ఇంటికి పంపాలని కోర్టు ఆదేశించింది.

Read Also: Komatireddy Venkat Reddy: నేడు ఆస్ట్రేలియాకు కాంగ్రెస్‌ ఎంపీ.. మునుగోడు ఎన్నిక తరువాతే ఎంట్రీ!

రెండు నెలల క్రితం తన అక్కతో కలిసి మిల్లులో పనిచేసి ఇంటికి వస్తున్న క్రమంలో చందా మెహరాజ్ అనే 15 ఏళ్ల బాలికను హైదరాబాద్ ఫతే చౌక్ లో నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన కుమార్తెను కిడ్నాప్ చేసి, బలవంతంగా 54 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించి, మతం మార్చారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే మొదట్లో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో మానవహక్కుల సంస్థల విమర్శల నేపథ్యంలో సెప్టెంబర్ లో కేసు నమోదు చేసి, బాలికను బలూచిస్తాన్ ప్రావిన్సులో గుర్తించి హైదరాబాద్ తీసుకువచ్చారు. బాలిక భర్త, ఆమె తల్లిదండ్రులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. బాలిక భర్త సమర్పించిన ఆధారాల్లో బాలిక వయసు 19 ఏళ్లుగా పేర్కొన్నాడు. అయితే తమ కూతురు మైనర్ అని తమకు పోలీసులు సహకరించడం లేదని హిందూ బాలిక తల్లిదండ్రులు తెలిపారు.

బాలికను వైద్యపరీక్షల కోసం కోర్టు ఆదేశించింది. మెడికల్ రిపోర్లులు వచ్చే వరకు భర్త, అమ్మాయితో కానీ ఆమె తల్లిదండ్రులతో కానీ ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని కోర్టు ఆదేశించింది. థార్, ఉమర్ కోట్, మిర్ పూర్ ఖాస్, ఖైర్ పూర్ ప్రాంతాల్లో హిందూ జనాభా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతాల్లో తరుచుగా హిందూ యువతులు, బాలికలు కిడ్నాపులకు గురవుతున్నారు.