NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్ టాప్ ఇంటెలిజెన్స్ అధికారి హతం..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ లో టాప్ ఇంటెలిజెన్స్ అధికారిని చంపారు ఉగ్రవాదులు. వాయువ్య పాకిస్తాన్ లో మంగళవారం ఉగ్రవాదులు, అధికారులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ అధికారి హతమవ్వగా.. ఆయన బృందంలోని ఏడుగురికి గాయాలు అయ్యాయని పాక్ ఆర్మీ వెల్లడించింది. గతేడాది నుంచి పాక్ పరిస్థితులు దిగజారడంతో వాయువ్య ప్రాంతం అయిన ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాకిస్తాన్ తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ఈ ప్రాంతాన్ని పాక్ నుంచి విముక్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also: Chennai: అవినీతి రాణి.. మహిళా ఇన్‌స్పెక్టర్ కహానీ..

ఇటీవల పెషావర్ నగరంలోని ఓ మసీదులో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 100 మందికి పైగా చనిపోయారు. ఎక్కువమంది పోలీసులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినవారిని గుర్తించే పనిలో అక్కడి అధికారులు ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ ఇందులో భాగంమే అని తెలుస్తోంది. దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో పాకిస్తాన్ గూఢాచర సంస్థ ఐఎస్ఐ బ్రిగేడియర్ ముస్తఫా కమల్ బార్కీ మరణించారు. ఈ ప్రాంతం చాలా కాలంగా ఉగ్రవాదులకు అడ్డాగా ఉంది. బార్కీ బృందంలో ఏడుగురు గాయపడగా.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పాక్ ఆర్మీ వెల్లడించింది.

కాగా, ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యులమని ఇప్పటి వరకు ప్రకటించుకోలేదు. అయితే ఈ ప్రాంతం తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఉగ్రవాద సంస్థ క్రియాశీలకంగా ఉంది. అక్కడ జరిగే అనేక దాడులకు ఈ ఉగ్రసంస్థే కారణం. ఈ ప్రాంతం భౌగోళికంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. పాక్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు సహాయసహకారాలను అందిస్తున్నారని పాక్ భావిస్తోంది.