NTV Telugu Site icon

Hassan Nasrallah: “మా నాయకుడు హసన్ నస్రల్లా చనిపోయాడు”.. ధ్రువీకరించిన హిజ్బుల్లా..

Hassan Nasrallah

Hassan Nasrallah

Hassan Nasrallah: హిజ్బుల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లా చనిపోయినట్లు ఆ సంస్థ శనివారం ధ్రువీకరించింది. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరూట్‌పై జరిగిన దాడిలో నస్రల్లాను హతమార్చామని ఇజ్రాయిల్ ఆర్మీ చెప్పిన కొన్ని గంటల తర్వాత హిజ్బుల్లా నుంచి ఈ ప్రకటన వచ్చింది. నస్రల్లా మరణం హిజ్బుల్లాకు భారీ దెబ్బగా అంతర్జాతీయ రాజకీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇరాన్ మద్దతు కలిగిన ‘‘ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’’లో నస్రల్లా అత్యంత కీలకం, ఇప్పుడు అతని మరణం ఇరాన్‌కి కూడా పెద్ద దెబ్బగా చెబుతున్నారు.

Read Also: HYDRA Commissioner Ranganath: హైడ్రా అంటే ఒక భరోసా.. హైడ్రాను భూచి, రాక్షసిగా చూపించొద్దు..

తమ చీఫ్ మరణించాడని చెబుతూనే..‘‘గాజా మరియు పాలస్తీనాకు మద్దతుగా లెబనాన్ మరియు దాని దృఢమైన మరియు గౌరవప్రదమైన ప్రజలకు రక్షణగా’’గా ఇజ్రాయిల్‌పై తన పోరాటాన్ని కొనసాగిస్తామని హిజ్బుల్లా చెప్పింది. అయితే, నస్రల్లా ఎలా చంపబడ్డాడనే విషయాన్ని చెప్పలేదు. బీరూట్ దక్షిణ శివారులోని దహియేహ్‌లోని నివాసం భవనం కింద ఉన్న భూగర్భంలోని ప్రధాన కార్యాలయంపై శుక్రవారం ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి, చంపేసినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. మరొక హిజ్బుల్లా కమాండర్ అలీ కరాకి కూడా ఇతర కమాండర్లలో హతమైనట్లు చెప్పారు.

హిజ్బుల్లా ‘‘సీనియర్ చైన్ ఆఫ్ కమాండ్’’ ప్రధాన కార్యాలయం నుంచి ఇజ్రాయిల్‌పై దాడులకు ప్లాన్ చేస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగినట్లు తెలిపింది. దాదాపుగా టన్ను బరువు ఉన్న 80కి పైగా బాంబుల్ని ఇజ్రాయిల్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీని వల్ల ఏకంగా 25 మీటర్ల లోతు బిలం ఏర్పడింది. ప్రస్తుతం హిజ్బుల్లాకు చెందిన నస్రల్లాతో పాటు కీలకమైన 9 మంది కమాండర్లు హతమయ్యారు.